Home  »  News  »  Idupu Kayitham: ఇడుపు కాయితం వివాదంలోకి పవన్ కళ్యాణ్.. సిగ్గుతో తలదించుకోవాలంటూ నరేష్ ఫైర్!

Updated : Jun 29, 2026

ఇటీవల కాలంలో ఒక సినిమా టైటిల్ చుట్టూ ఇంత పెద్ద ఎత్తున ప్రాంతీయ, రాజకీయ వివాదం చెలరేగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం 'ఇడుపు కాయితం' (Idupu Kayitham). ప్రముఖ నిర్మాత 'బన్నీ' వాస్, సుకుమార్ సతీమణి తబిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. 

అయితే 'ఇడుపు కాయితం' అనే టైటిల్ సోషల్ మీడియాలో ఒక పెద్ద మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ వివాదం రోజురోజుకూ ముదిరిపోతుండటంతో సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ టైటిల్ వివాదాన్ని అనవసరంగా పెద్దది చేసి ఒక 'జాతీయ సమస్య'గా మార్చేశారంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే, ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తనకు 'ఇడుపు కాయితం' అంటే అర్థం కాలేదని, ఈ సినిమాను ఆంధ్ర ప్రాంతంలో సబ్‌టైటిల్స్ వేసి విడుదల చేస్తే అక్కడి ప్రజలు హ్యాపీగా ఫీలవుతారంటూ ట్వీట్ చేశాడు. ఈ ఒక్క చిన్న ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో 'ఆంధ్ర వర్సెస్ తెలంగాణ'గా మారి, రెండు ప్రాంతాల నెటిజన్ల మధ్య తీవ్రమైన వాగ్వాదానికి దారితీసింది. 

ఈ వివాదం అంతటితో ఆగకుండా రాజకీయ రంగు పులుముకుంది. కల్వకుంట్ల కవిత ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లాగడం సంచలనంగా మారింది. 'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం అని అర్థం వచ్చేలా మాట్లాడుతూ, దాని అర్థం తెలియకపోతే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్‌ను అడగాలంటూ ఆమె వ్యంగ్యంగా చేసిన విమర్శలు ఈ కాంట్రవర్సీని మరింత రాజేసాయి. ఒక సినిమా టైటిల్‌ను పట్టుకుని వ్యక్తిగత, ప్రాంతీయ విమర్శలకు వాడుకోవడంపై పరిశ్రమ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేశాయి.

ఈ పరిణామాలపై స్పందించిన నరేష్ విజయకృష్ణ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన వీడియో సందేశాన్ని పంచుకున్నారు. మన సొంత భాషను, మన మాండలికాలను మనమే అవమానించుకోవడం అనేది ఒక తెలుగువాడిగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ, రాయలసీమ, కోనసీమ లేదా ఉత్తరాంధ్ర ఇలా ఏ ప్రాంతపు మాండలికం అయినా సరే అది తెలుగు భాషలోని వైవిధ్యానికి, గొప్పతనానికి నిదర్శనమని నరేష్ గుర్తుచేశారు. అన్యభాషా చిత్రాలైన కన్నడ చిత్రం 'కాంతార', తమిళ చిత్రం 'కరుప్పు' వంటి సినిమాల టైటిళ్లకు అర్థాలు తెలియకపోయినా తెలుగు ప్రేక్షకులు వాటిని గుండెలకు హత్తుకుని వందల కోట్ల వసూళ్లు అందించారని, అలాంటప్పుడు మన సొంత తెలుగు భాషలోని ఒక పదాన్ని టైటిల్‌గా పెడితే ఇంతలా రచ్చ చేయడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు.

సినిమాను కేవలం ఒక వినోద సాధనంగా, సినిమాగానే చూడాలని నరేష్ కోరారు. భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న ఆయన, తెలుగు భాషా సంఘం వెంటనే చొరవ తీసుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, మీడియా, నెటిజన్లు అందరూ కలిసి ఈ అనవసర వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని, లేదంటే మన చేతులతో మన భాషను మనమే నాశనం చేసుకున్న వాళ్లమవుతామని హెచ్చరించారు.

 

https://x.com/ItsActorNaresh/status/2071172781191098497






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.