Home  »  News  »  వారణాసి సెట్‌లో మహేష్ బాబుకు చుక్కలు చూపించిన రాజమౌళి.. ఒక్క సీన్ కోసం 100 టేక్‌లు!

Updated : Jun 26, 2026

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా 'వారణాసి' సినిమాపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మ్యాగ్నమ్ ఓపస్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. 

తాజాగా ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'వారణాసి' షూటింగ్ సెట్స్‌లో రాజమౌళి పర్ఫెక్షన్ కోసం పడే తపన గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలను వెల్లడించారు. జక్కన్న వర్కింగ్ స్టైల్ చూసి తానే స్వయంగా ఆశ్చర్యపోయానని, ఆయనలాంటి అత్యంత కష్టపడే దర్శకుడిని తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని పృథ్వీరాజ్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ షూటింగ్ సెట్‌లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్‌ను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "నేను చెప్పబోయేది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.. ఇది వారణాసి సెట్స్‌లో ఒక రోజు నిజంగా జరిగిన సంఘటన. సినిమాలో మహేష్ బాబు మరియు నాపై చిత్రీకరించే ఒక నిర్దిష్టమైన షాట్ కోసం మేము ఉదయాన్నే సెట్‌లోకి అడుగుపెట్టాము. సీన్ పక్కాగా వచ్చేంతవరకు రాజమౌళి సార్ అస్సలు రాజీపడలేదు. అలా ఉదయం ప్రారంభమైన ఆ ఒక్క షాట్ షూటింగ్ నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అది 94వ టేకో లేదా 97వ టేకో నాకు స్పష్టంగా గుర్తులేదు కానీ, దాదాపు 100 టేకుల వరకు మేము ఆ ఒక్క సీన్ కోసమే కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. దీనిపై షూటింగ్ గ్యాప్‌లో నేను, మహేష్ బాబు సరదాగా జోకులు కూడా వేసుకున్నాము" అంటూ ఆ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు.

లంచ్ బ్రేక్ సమయం అయినప్పటికీ ఆ షాట్ ఇంకా ఓకే అవ్వకపోవడంతో రాజమౌళి గారు అందరినీ త్వరగా భోజనాలు ముగించుకుని రమ్మని చెప్పారు. రెండో ముద్ద నోట్లో పెట్టుకునేలోపే షాట్ రెడీ అయిపోయిందని, వెంటనే సెట్‌కు రావాలని జక్కన్న నుండి పిలుపు వచ్చింది. దాంతో భోజనం కూడా సరిగ్గా చేయకుండా మళ్లీ కెమెరా ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అలా సాయంత్రం 6:30 గంటలు దాటిపోతున్నా ఆ సీన్ పర్ఫెక్ట్‌గా రాకపోవడంతో, అక్కడే ఉన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సమయం అయిపోయిందంటూ దర్శకుడికి సైగలు చేయడం ప్రారంభించారు. చివరికి రాజమౌళి చేసేదేమీ లేక ప్యాకప్ చెప్పి, ఇదే సీన్‌ను రేపు ఉదయం మళ్లీ మొదటి నుండి చేద్దామని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం రాజమౌళి ఎంతటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటారని దీన్ని బట్టి అర్థమవుతోంది.

రాజమౌళి క్రమశిక్షణ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ గురించి పృథ్వీరాజ్ మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ఉదయం 7 గంటలకు షూటింగ్ షెడ్యూల్ ఉంటే, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు తాను సెట్ కి వెళ్లేసరికే అక్కడ కెమెరా క్రేన్లు, లైటింగ్ సెటప్ అంతా సిద్ధంగా ఉండేదట. ఒకసారి పృథ్వీరాజ్ ఆశ్చర్యపోయి రాజమౌళిని మీరెప్పుడు వచ్చారు సార్ అని అడిగితే, తను తెల్లవారుజామున 5:15 గంటలకే సెట్‌కు చేరుకుని తన అసిస్టెంట్లతో కలిసి అన్ని సీన్లను రిహార్సల్స్ చేసుకున్నానని సమాధానం ఇచ్చారు. షూటింగ్‌లో లంచ్ బ్రేక్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని, సెట్‌లోకి అందరికంటే ముందుగా వచ్చి, అందరి కంటే చివరగా వెళ్లే వ్యక్తి కేవలం రాజమౌళి మాత్రమేనని పృథ్వీరాజ్ కొనియాడారు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్స్ కొట్టినప్పటికీ, రాజమౌళి ఇప్పటికీ తన మొదటి సినిమా చేస్తున్న కొత్త దర్శకుడిలాగే అదే ఉత్సాహంతో, కసితో పనిచేస్తున్నారని అన్నారు. 

ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్రుడిగా, ప్రియాంక మందాకినిగా, పృథ్వీరాజ్ కుంభ అనే వీల్ చైర్ బాండ్ విలన్ గా నటిస్తుండగా, ఈ 1300 కోట్ల భారీ బడ్జెట్ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.