Home  »  News  »  Vaazha 2 Telugu Movie Review: ‘వాలా2` బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రివ్యూ

Updated : Apr 23, 2026

నటీనటులు: హాషిర్ హెచ్., అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి., అల్ఫోన్స్ పుత్రేన్, బిజు కుట్టన్, విజయ్‌బాబు తదితరులు
సంగీతం: రాజ్ ప్రకాష్, పర్వతీష్ ప్రదీప్, అశ్విన్ ఆర్యన్ 
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ‘ఎ’ టీమ్
సినిమాటోగ్రఫీ: అఖిల్ లైలాసురన్
ఎడిటింగ్: కన్నన్ మోహన్
రచన: విపిన్ దాస్ 
నిర్మాతలు: విపిన్ దాస్, సాహు గారపాటి, హారిస్ దేశం, ఆదర్శ్ నారాయణ్, పి.బి. అనీష్
బ్యానర్స్: ఇమాజిన్ సినిమాస్, విబిటిఎస్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్స్, సిగ్నేచర్ స్టూడియోస్, ఐకాన్ స్టూడియోస్
దర్శకత్వం: సావిన్ సా
విడుదల తేదీ: 24.04.26
సినిమా నిడివి: 162.57 నిమిషాలు

మలయాళంలో రూపొందే సినిమాలు ఎక్కువ శాతం సహజత్వానికి దగ్గరగా, మానవ సంబంధాలను మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఈ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతుంటారు. అలా 2024లో చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ‘వాలా’ చిత్రం దాదాపు 38 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్ప్పుడా సినిమాకు రెండో భాగంగా ‘వాలా2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్‌’ చిత్రాన్ని 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఏప్రిల్ 2న మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికి 213 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది. మొదటి భాగానికి, దీనికి సంబంధం లేకపోయినా అందులోని కొన్ని అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంది? తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనే విషయం తెలుసుకుందాం. 

కథ:

‘వాలా’ అంటే మలయాళంలో అరటి చెట్టు అని అర్థం. తల్లిదండ్రులతో గొడవలు పడి, వారి అంచనాలను అందుకోలేక సతమతమయ్యే యువతకు ఈ సినిమా ఒక ఊరటనిస్తుందని చెప్పాలి. ‘నిన్ను కనే బదులు ఒక అరటి చెట్టు నాటినా కనీసం గెలలు అన్నా వచ్చేవి’ అని పెద్దలు తిడుతూ ఉంటారు. ఈ టైటిల్‌లోనే కథ అంతా ఉంది. 

ఇది నలుగురు కుర్రాళ్ల కథ. చదువుకోమని కాలేజీకి పంపిస్తే అక్కడ వీరు చేసే అల్లరి, గొడవల వల్ల తల్లిదండ్రులు కాలేజీ మేనేజ్‌మెంట్ ముందు తలెత్తుకోలేకపోతారు. అదే క్రమంలో అనుకోకుండా ఆ నలుగురు కుర్రాళ్లు ఒక కేసులో ఇరుక్కుంటారు. దాంతో ఆ ఊళ్లోని ప్రతి ఒక్కరి ముందూ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ ఉండలేక ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే యు.కె. వెళ్లిపోయి అక్కడ పనిచేసుకుంటూ చదువుకోవాలనుకుంటారు. వారిలో ఒకరు తప్ప మిగతా ముగ్గురూ పాస్ అవుతారు. ఇద్దరు యు.కె.కి, ఒకరు దుబాయ్‌కి వెళ్లిపోతారు. అక్కడ వారు పడే బాధలు, ఫెయిల్ అయిన యువకుడు ఇక్కడ ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వారు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వారి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి విలువ ఎలా తెలుసుకున్నారు అనేది మిగతా కథ. 

విశ్లేషణ:

సోషల్ మీడియాలో స్టార్స్‌గా ఉన్న యువకులను ఈ సినిమాలో హీరోలుగా తీసుకోవడం అనేది మలయాళ దర్శకనిర్మాతలు తీసుకున్న ఓ కొత్త నిర్ణయం. హాషిర్, అలన్, అజిన్, వినాయక్.. ఈ నలుగురు సినిమాలో ప్రధాన పాత్ర ధారులు. కాలేజీకి వెళ్లే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పే కార్యక్రమం ఫస్టాఫ్ అంతా ఉంటుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి నలుగురు ఫ్రెండ్స్‌లో ముగ్గురు విదేశాలకు వెళ్లడం, అక్కడ బాధలు పడడం చూపించారు. అంతవరకు బాగానే ఉందిగానీ సినిమాలో లెంగ్తీ సీన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆడియన్స్‌కి ఇరిటేషన్ వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. కాలేజీలో జరిగే గొడవలు, థియేటర్‌లో కుర్రాళ్లు చేసే హడావిడి, నలుగురు ఫ్రెండ్స్‌లో ఒకరికి ఇస్లాం మతంలో ఉండే సున్తీ కార్యక్రమాన్ని చూపించడం, కాలేజీలో జరిగే పేరెంట్స్ మీటింగ్, పోలీస్ ఆఫీసర్ ఇచ్చే క్లాసులు, నలుగురు ఫ్రెండ్స్‌లో ముగ్గురు విదేశాలకు వెళ్లడంతో ఇండియాలోనే ఉండే ఫ్రెండ్ పదే పదే వాళ్లని వెళ్లొద్దని చెప్పే సీన్స్ అన్నీ బాగా లెంగ్తీగా ఉండడంతో ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తి కలిగించవు. సినిమా ప్రారంభంలో ఎక్కువ శాతం పిల్లలతోనే ఉంటుంది. ఆ సన్నివేశాలు ఆసక్తిగానే అనిపించాయి. టోటల్‌గా 2 గంటల 40 నిమిషాల సినిమా నిడివి ఉంది. లెంగ్తీగా ఉండే సీన్స్ కట్ చేస్తే 2 గంటల సినిమా అవుతుంది. దీన్నిబట్టి ఆ సీన్స్ ఎంత లెంగ్తీగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాలేజీలో జరిగే గొడవలు, మేనేజ్‌మెంట్‌ చేసే హడావిడి కొంత ఓవ‌ర్‌గానే అనిపిస్తాయి. ఇలాంటివి కాలేజీల్లో జరుగుతాయా అనే అనుమానం కూడా వస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఆ అల్లర్లు, హడావిడి లేకుండా సెంటిమెంట్‌, ఎమోషనల్‌ బాండింగ్‌ వైపు కథ ట‌ర్న్‌ అవుతుంది. ఇక అక్కడి నుంచి తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్లను అర్థం చేసుకోవడం, ఒక హీరో తన ప్రేమను కూడా త్యాగం చెయ్యడం వంటి సీన్స్‌తో  సినిమా ఎండ్ అవుతుంది. సీన్స్ పరంగా కంటతడి పెట్టించినా, ఆ యువకులు సరైన లక్ష్యాన్ని ఎంచుకోకుండానే సినిమా ముగుస్తుంది. కథపరంగా చెప్పాలంటే, క్లైమాక్స్‌ అర్థవంతంగా లేదు అనిపిస్తుంది. 

నటీనటులు:

సినిమాలోని ప్రధాన పాత్రల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. ప్రేమమ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అల్ఫోన్సా పుత్రేన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా ఒక కీలక పాత్ర పోషించారు. ఈ పాత్ర ద్వారా నేటి యువతకు కొన్ని సందేశాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించిన హాషిర్, అలన్, అజిన్, వినాయక్ తమ పాత్రలకు జీవం పోశారని చెప్పాలి. నేటి యూత్‌కి రిప్రజెంటివ్స్‌గా కనిపించారు. 

సాంకేతిక నిపుణులు: 

ఈ సినిమా కథ, బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫీ నేచురల్‌గా ఉంది. కన్నన్ మోహన్ ఎడిటింగ్ గురించి చెప్పాలంటే సినిమాలో చాలా లెంగ్తీ సీన్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో టీవీ సీరియల్స్‌ని కూడా గుర్తు తెచ్చాయి. అయితే డైరెక్టర్ సూచించిన మేరకే ఎడిటింగ్ జరిగి ఉంటుంది కాబట్టి దానికి పూర్తి బాధ్యుడు డైరెక్టరే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి 9 మంది మ్యూజిక్ డైరెక్టర్లు ప‌నిచేశారు. వారిలో ప్రధానంగా ముగ్గురు ఉన్నారు. స్టోరీని నడిపించే పాటల్ని ఆ మూడ్‌కి తగ్గట్టు చేసి ఫర్వాలేదు అనిపించుకున్నారు. ‘ఎ’ టీమ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్టర్ సావిన్ సా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా ద్వారా ఏదో చెప్పాలని ట్రై చేసి యూత్‌కి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే సినిమా ముగింపులో దేనికీ సరైన పరిష్కారం చూపించలేక వదిలేశారు అనిపిస్తుంది. ప్రారంభం నుంచి చివరి వరకు స్క్రీన్‌ప్లేను అద్భుతంగా నడిపించారు. కొన్ని లెంగ్తీ సీన్స్ వల్ల మనం సినిమా చూస్తున్నామా సీరియల్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే చివరి అరగంట ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్ చెయ్యడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 

ప్లస్ పాయింట్స్:

నటీనటుల పెర్‌ఫార్మెన్స్
ఫోటోగ్రఫీ
ఎమోషనల్ సీన్స్
నేటి యూత్‌ని ప్రజెంట్ చేసిన విధానం
యూత్‌కి ఇచ్చిన సందేశాలు

మైనస్ పాయింట్స్:

లెక్కకు మించి ఉన్న లెంగ్తీ సీన్స్
పేలవంగా అనిపించే క్లైమాక్స్
ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టే కొన్ని సీన్స్

ఫైనల్‌గా చెప్పాలంటే..

యూత్‌ని ఆకట్టుకునే అంశాలు ఉంటూనే వారి బాధ్యతను గుర్తు చేసే సినిమా ఇది. యూత్ అల్లరి, గుండెలకు హత్తుకునే కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం ఒకసారి ఈ సినిమా చూడొచ్చు. మరో విశేషం ఏమిటంటే.. ‘వాలా3.. బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్‌’ పేరుతో ఈ సిరీస్‌లో మరో సినిమా రాబోతోంది. 

రేటింగ్: 2.75/5

- జి.హరా






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.