![]() |
![]() |
రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని స్టార్ హీరోలందరి సరసన నటించి ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి త్రిష. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. 42 ఏళ్లు పైబడినా ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు తన గ్లామర్‌తో మంచి పోటీ ఇస్తున్న త్రిషకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆమెకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో చెన్నయ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో త్రిష నివాస పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు వారికి లభించలేదు. అది ఒక ఫేక్ కాల్ అని పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఆ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ భవనానికి కూడా ఇలాంటి కాల్స్ రావడం సంచలనం సృష్టించింది.
ఒకేసారి మూడు చోట్ల బాంబులు పెట్టామని కాల్స్ రావడంతో సినీ, రాజకీయ వర్గాలు షాక్ అయ్యాయి. చెన్నయ్‌లోని అల్వార్‌పేటలో ఉన్న త్రిష నివాసానికి దుండగులు ఫోన్ చేసి ఇంట్లో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలుతుందని హెచ్చరించారు. త్రిష కుటుంబసభ్యులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. చివరికి అది ఫేక్ కాల్ అని తెలియడంతో త్రిష ఇంటివద్ద, ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
![]() |
![]() |