![]() |
![]() |

తెలంగాణలో 'ఓజీ' సినిమా టికెట్ రేట్ల పెంపు జీవోపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్టేను స్వాగతిస్తున్నానని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, అసలు 'ఓజీ' సినిమా రేట్ల పెంపు జీవో తనకు తెలియకుండా ఎలా ఇస్తారంటూ.. హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదని స్పష్టం చేశారు. (They Call Him OG)
తెలంగాణలో బెనిఫిట్ షోలకి, టికెట్ రేట్ల పెంపుకి గత ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. అదే ఆనవాయితీని ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తోంది. అయితే, హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని.. ఇక మీదట మిడ్ నైట్ షోలకి అనుమతులు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తెలిపింది. కానీ, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన రిక్వెస్ట్ లతో మళ్ళీ మనసు మార్చుకొని అనుమతులు ఇస్తోంది. ఈ క్రమంలోనే 'ఓజీ' సినిమాకి ముందురోజు రాత్రి ప్రీమియర్ షోలతో పాటు, మొదటి పది రోజులు టికెట్ రేట్ల పెంపుకి అనుమతి ఇచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించగా.. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ జీవోపై స్టే ఇచ్చింది.
Also Read: ఓజీ మూవీ రివ్యూ
ప్రస్తుతం 'ఓజీ' టికెట్ రేట్ల పెంపు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇక నుండి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదు. ఓజీ సినిమా రేట్ల పెంపు జీవో నాకు తెలియకుండా ఇచ్చారు. పక్క రాష్ట్రంలో జీవో ఇచ్చారు కాబట్టి, మా దగ్గర ఇచ్చారు అనుకుంటున్నా. టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను స్వాగతిస్తున్నా. ఇక నుండి చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఒక్కటే టికెట్ రేటు. సామాన్యులపై భారం పడకుండా చూస్తాం." అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
![]() |
![]() |