![]() |
![]() |
అతనిది ఓ మధ్య తరగతి కుటుంబం. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండేవాడు. దానితోపాటు సినిమాలంటే అమితమైన ఆసక్తి. సినిమాల్లోకి రావాలని, ఏదో సాధించాలని కలలు కనేవాడు. చదువుకుంటూనే ఎల్.వి.ప్రసాద్ ఫిల్మ్ అండ్ టివి అకాడమీలో డైరెక్షన్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత షార్ట్ ఫిలింస్ తియ్యాలనుకున్నాడు. కానీ, దానికి అవసరమైన కెమెరా కొనుక్కునేందుకు డబ్బు లేదు. కొడుకు ఆసక్తిని గమనించిన తల్లి తన బంగారాన్ని తాకట్టు పెట్టి 44 వేల రూపాయలతో సోని బ్రాండ్ కెమెరా కొనిపెట్టింది. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంగా షార్ట్ ఫిలింస్ తియ్యడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు.. 30 షార్ట్ ఫిలింస్ చేశాడు. వాటితో యూట్యూబ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
సినిమా డైరెక్టర్ అవ్వాలనేది అతని ఎయిమ్. అప్పటివరకు అతను చేసిన షార్ట్ ఫిలింస్‌ను పూరి జగన్నాథ్‌ను కలిసి చూపించాడు. అలా అతని దగ్గర అసిస్టెంట్‌గా చేరాలన్నది ఆ కుర్రాడి ఆలోచన. కానీ, ఆ షార్ట్ ఫిలింస్ చూసిన పూరి.. ‘నువ్వు ఎవరి దగ్గర పనిచెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు సినిమా తియ్యగలవు’ అని ఎంతో ఎంకరేజింగ్‌గా చెప్పారు. పూరి ఇచ్చిన ధైర్యంతోనే తన ప్రయత్నాలు మొదలుపెట్టి మొత్తానికి డైరెక్టర్ అయిపోయాడు. ఎవరి దగ్గరా పనిచేయకపోయినా ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అతనెవరో కాదు.. సుజీత్.
2014లో వచ్చిన శర్వానంద్ మూవీ ‘రన్ రాజా రన్’తో డైరెక్టర్ అయిన సుజీత్.. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ సాధించాడు. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఆ సినిమా 34 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ కాంపౌండ్‌లోనిదే కావడంతో రెండో సినిమా ప్రభాస్‌తో చేసే అవకాశం దక్కింది. ‘సాహో’ చిత్రాన్ని టెక్నికల్‌గా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించిన సుజీత్.. ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది.
చిన్నతనం నుంచీ పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని సుజీత్. పవర్‌స్టార్ సినిమా రిలీజ్ అయిన రోజు నానా హంగామా చేసేవాడు. ఎర్ర కండువా కట్టుకొని థియేటర్ల దగ్గర సందడి చేసేవాడు. అలాంటి సుజీత్.. పవన్‌కళ్యాణ్‌తో ఒక అద్భుతమైన సినిమా చెయ్యాలనుకున్నాడు. ఆ అద్భుతమే ‘ఓజి’ రూపంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవర్‌స్టార్ ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో.. ఒక అభిమానిగా దాన్ని తెరపై చూపించి జేజేలు అందుకుంటున్నాడు. కేవలం మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న సుజీత్.. భవిష్యత్తులో మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
![]() |
![]() |