![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజి’ చిత్రానికి వస్తున్న హైప్ మామూలుగా లేదు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓజి కాన్సర్ట్ పేరుతో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ఓజి’ ట్రైలర్‌ను పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది అభిమానుల మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఎంతో ఓపెన్‌గా అభిమానులతో మాట్లాడారు. ఈ సినిమాలోని గెటప్‌తోనే పవన్‌కళ్యాణ్ ఈ ఈవెంట్‌కి రావడం విశేషం.
ఈ ఫంక్షన్‌కు పవన్‌కళ్యాణ్‌తోపాటు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, థమన్‌తో సహా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అల్లు అరవింద్, దిల్ రాజు, కోన వెంకట్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే వర్షం మొదలైంది. అయినప్పటికీ అభిమానులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యక్రమం పూర్తయ్యేవరకు వున్నారు. ఓజస్ గంభీర గెటప్‌లో సినిమాలో ఉపయోగించిన కత్తి పట్టుకొని స్టేజ్ మీదకు నడుచుకుంటూ వచ్చారు. సినిమాలోని జపనీస్ డైలాగ్‌ను స్టేజ్ మీద వినిపించి అందర్నీ సంతోషపరిచారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘సుజిత్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. నన్ను సినిమాలోని గెటప్‌తోనే ఇక్కడికి రమ్మన్నాడు. నేను డిప్యూటీ సీఎం అనే సంగతే మర్చిపోయాను. సినిమాలో కాబట్టి కత్తి పట్టాను. అదే బయట ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకొని వస్తే బాగుంటుందా. నేను ఏం చేసినా అది మీ కోసమే, మీ ఆనందం కోసమే. నేను ఈ సినిమా చేయడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. సాహో తర్వాత టాలీవుడ్‌లో ఒక యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడు అతనితో సినిమాకు మీకు బాగుంటుంది అని చెప్పాడు. ‘ఓజి’ సినిమాకి నేను స్టార్‌ని కాదు. ఇద్దరు స్టార్లు ఉన్నారు. ఒకరు సుజిత్, మరొకరు తమన్. వీళ్లిద్దరూ పిచ్చి పట్టినట్టే చేశారు. వాళ్ళిద్దరూ ఒక టూర్‌కి వెళ్లినట్టు చేశారు. ఆ టూర్‌లోకి నన్ను కూడా లాగారు. వాళ్లిద్దరూ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇక నా విషయానికి వస్తే.. నేను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా గురించి తప్ప మరొక విషయం ఆలోచించను. అలాగే రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు తప్ప మరో విషయం గురించి ఆలోచించను. ‘ఓజి’ సినిమా విషయానికి వస్తే.. ఇది తప్పకుండా మీ అందరికీ నచ్చి తీరుతుంది’ అన్నారు.
![]() |
![]() |