![]() |
![]() |

జూలై, ఆగస్టు నెలల్లో విడుదలైన సినిమాలు సినీ ప్రియులని పెద్దగా అలరించలేకపోయాయి. పేరుకి 'హరి హర వీరమల్లు', 'కింగ్డమ్', 'వార్-2', 'కూలీ' వంటి పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ.. ఏదీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన 'మహావతార్ నరసింహ' మాత్రమే అందరి మన్ననలు పొందుతూ, భారీ వసూళ్ళతో ఘన విజయం సాధించింది. ఇక సెప్టెంబర్ విషయానికొస్తే.. ఈ నెలలోనూ పలు ఆసక్తికర సినిమాలు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ మొదటి వారంలో 'ఘాటి', 'మదరాసి', 'లిటిల్' హార్ట్స్ వంటి సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఘాటి' (Ghaati). ఈ సినిమా విజయం అనేది ఇద్దరికీ కీలకం. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత క్రిష్ సరైన సక్సెస్ చూడలేదు. కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించిన అనుష్క.. 'భాగమతి' తర్వాత చేసిన పవర్ ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఇదే. సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 5న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ మూవీ.. అనుష్క, క్రిష్ లకు సాలిడ్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
కోలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోలలో ఒకడిగా శివకార్తికేయన్ పేరు తెచ్చుకున్నాడు. గతేడాది 'అమరన్'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న శివకార్తికేయన్.. ఈ సెప్టెంబర్ 5న 'మదరాసి'(Madharaasi)తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ఈ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని మురుగదాస్ భావిస్తున్నాడు. ప్రచార చిత్రాలకు మంచి స్పందనే లభించింది. ఈ సినిమాతో మురుగదాస్ కమ్ బ్యాక్ ఇచ్చి.. శివకార్తికేయన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేలా చేస్తాడేమో చూడాలి.
'ఘాటి', 'మదరాసి'తో పాటు సెప్టెంబర్ 5న విడుదలవుతున్న 'లిటిల్ హార్ట్స్'(Little Hearts) అనే చిన్న సినిమా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈటీవీ విన్ లో '90s' వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అందులో లీడ్ రోల్ చేసిన మౌళినే లిటిల్ హార్ట్స్ లో హీరోగా నటించాడు. అలాగే ఆ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి.. ఈటీవీ విన్ తో కలిసి ఈ మూవీని నిర్మించడం విశేషం. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సాయి మార్తాండ్ దర్శకుడు. టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. యువత ఈ సినిమాని బాగానే ఆదరించే అవకాశముంది.
ఒకే రోజు విడుదలవుతున్న 'ఘాటి', 'మదరాసి', 'లిటిల్ హార్ట్స్'లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. అనుష్క నటించిన సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో 'ఘాటి' ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఫలితం అనేది టాక్ మీద ఆధారపడి ఉంటుంది.
![]() |
![]() |