![]() |
![]() |

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత.. కొంతకాలంగా సినిమాలు తగ్గించారు. ఇప్పుడు ఎక్కువగా హిందీ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. తెలుగులో చివరిగా 2023లో వచ్చిన 'ఖుషి' సినిమాలో హీరోయిన్ గా నటించారు. అలాగే ఆమె నిర్మించిన 'శుభం' అనే సినిమా ఈ ఏడాది విడుదల కాగా.. అందులో ప్రత్యేక పాత్ర పోషించారు. సమంత నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమెనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మొదట ఓ కొత్త డైరెక్టర్ తో 'మా ఇంటి బంగారం' సినిమాని ప్లాన్ చేసిన సమంత.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బాధ్యతను తన ఫ్రెండ్, ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. (Samantha Ruth Prabhu)
సమంత, నందిని రెడ్డి మధ్య మంచి అనుబంధముంది. గతంలో వీరి కలయికలో 'జబర్దస్త్', 'ఓ బేబీ' సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఓ బేబీ' ఘన విజయం సాధించింది. అయితే దీని తర్వాత హీరోయిన్ గా సమంత తెలుగులో హిట్ చూడలేదు. 'జాను', 'యశోద', 'శాకుంతలం', 'ఖుషి' సినిమాలు నిరాశపరిచాయి. మరోవైపు నందిని రెడ్డి కూడా 'ఓ బేబీ' తర్వాత 'అన్నీ మంచి శకునములే' అనే ఒకే ఒక్క సినిమా చేయగా.. అది పరాజయం పాలైంది. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు 'మా ఇంటి బంగారం' కోసం మళ్ళీ చేతులు కలుపుతున్నారు. ఫ్లాప్స్ లో ఉన్న వీరు ఈ సినిమాతో 'ఓ బేబీ' లాంటి విజయాన్ని అందుకొని కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.
![]() |
![]() |