![]() |
![]() |

ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' సినిమాలు విడుదలవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున వంటి స్టార్స్ భాగమయ్యారే కానీ.. ఇవి నేరుగా తెలుగులో తెరకెక్కినవి కావు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రైట్స్ హైక్ కోసం డిస్ట్రిబ్యూటర్లు అనుమతి కోరారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలకు తెలుగునాట టికెట్ హైక్ కి అనుమతి లభించింది. ఇదే బాటలో 'వార్-2', 'కూలీ' కూడా పయనించాలని చూశాయి. అయితే ఈ విషయాన్ని తెలుగు ప్రేక్షకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే తెలుగులో తెరకెక్కుతున్న అన్ని పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకున్నారు. కనీసం డబ్బింగ్ సినిమాలకైనా పెంచకుండా ఉండాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో.. తెలంగాణలో 'వార్-2', 'కూలీ' టికెట్ హైక్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేయలేదని, తెలంగాణ ప్రభుత్వమే టికెట్ ధరల పెంపుకి అనుమతి నిరాకరించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. దీంతో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు.. పెద్ద సినిమా వచ్చినప్పుడల్లా ధరలు పెంపుకి అనుమతి ఇవ్వడం వల్ల.. ప్రేక్షకులపై భారం పడుతుంది. దీంతో థియేటర్ కి వెళ్ళి సినిమా చూడాలంటే ప్రేక్షకులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైగా డబ్బింగ్ సినిమాలకు కూడా హైక్ ఇవ్వడం అనేది ప్రేక్షకుల అసహనానికి కారణమవుతోంది. ఈ క్రమంలోనే 'వార్-2', 'కూలీ' టికెట్ ధరల పెంపుకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సమాచారం.
![]() |
![]() |