![]() |
![]() |

సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్ లకు హాజరయ్యేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకేసారి అంత శాతం పెంచడం కుదరదని నిర్మాతలు చెబుతున్నారు. అవసరమైతే యూనియన్ తో సంబంధం లేకుండా వర్కర్స్ ని తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతలు సమావేశమయ్యారు. చిరంజీవిని కలిసిన వారిలో సి. కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి శంకర్, సుప్రియ యార్లగడ్డ ఉన్నారు.
చిరంజీవితో భేటీ అనంతరం నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. "మేము చిరంజీవి గారిని కలసి సమస్య చెప్పాము. 'షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదు. మీ సమస్యలు చెప్పారు, అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటాను. రెండు మూడు రోజులు చూసి, పరిస్థితి చక్కబడకపోతే నేను జోక్యం చేసుకుంటాను' అని చిరంజీవి గారు చెప్పారు." అని తెలిపారు.
ఇక సినీ కార్మికుల ఆందోళనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. "కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో నేను మాట్లాడతాను. ఈ అంశాలన్నిటిని కూడా దిల్ రాజు కు అప్పగించాము, ఆయన చర్చిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.. టికెట్ల ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి." అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |