![]() |
![]() |
తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్‌గా ఎంతో మంది నటించి ఆ పాత్రకు వన్నె తెచ్చారు. హీరోల సంగతి ఎలా ఉన్నా.. దాదాపు 35 సంవత్సరాల క్రితం విజయశాంతి కర్తవ్యం చిత్రంలో పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్‌గా నటించి సంచలనం సృష్టించింది. పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ స్ఫూర్తితో రూపొందిన కర్తవ్యం చిత్రంలో వైజయంతిగా నటించారు విజయశాంతి. ఆ వైజయంతికి ఒక కొడుకు ఉంటే అనే ఊహతో రూపొందుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అర్జున్‌గా నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వైజయంతి పాత్రను కంటిన్యూ చేస్తూ విజయశాంతి మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సోమవారం విడుదలైంది. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ప్రీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు విడుదలైన టీజర్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
టీజర్ ప్రారంభంలోనే విజయశాంతి యాక్షన్ సీక్వెన్స్‌లు చూపిస్తూ ఆమె ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. ‘10 సంవత్సరాల నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతీసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం.. నా కొడుకు అర్జున్’’ అంటూ విజయశాంతి వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. విజయశాంతి కొడుకు పాత్రలో కళ్యాణ్‌రామ్ నటించారు. ‘నెక్స్‌ట్ బర్త్ డేకి నువ్వు నాకివ్వబోయే గిఫ్ట్ ఇదే..’ అంటూ ‘అర్జున్ విశ్వనాథ్’ అనే నేమ్ ఉన్న పోలీస్ యూనిఫామ్‌ని కొడుక్కి అందిస్తుంది వైజయంతి. అయితే తల్లి ఆశించినట్టుగా కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వలేదు అనేది టీజర్‌ని బట్టి తెలుస్తోంది. ‘రేపటి నుంచి వైజాగ్‌ని పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాథ్ కను సైగలు శాసిస్తాయ్’ అంటూ కళ్యాణ్‌రామ్ చెప్పే డైలాగ్స్ చూస్తే అతను చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తుంటాడని అర్థమవుతుంది. ఆ విధంగా తల్లీకొడుకుల మధ్య ఓ సంఘర్షణ నెలకొంటుంది. ‘నేను డ్యూటీలో ఉన్నా, లేకున్నా.. చచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా నా కళ్ల ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్‌తో సినిమా హై ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
తన కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కన్న వైజయంతిని అర్జున్ ఎందుకు బాధ పెట్టాల్సి వచ్చింది. అతనికి ఎదురైన సవాళ్లేమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథను రూపొందించారు.
ప్రేమ, ఆప్యాయతల మధ్య పెరిగిన అర్జున్, అతను పోలీస్ ఆఫీసర్ అయితే చూడాలని కోరుకున్న తల్లి మార్గాలు వేర్వేరుగా అయిపోవడానికి రీజన్ ఏమిటి? అనేది సినిమాలో కీలకంగా ఉండబోతోంది. 58 ఏళ్ళ వయసులోనూ అదే ఎనర్జీతో కనిపించారు విజయశాంతి. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా మునుపటి వేగంతోనే చేశారు. చాలా సంవత్సరాల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కళ్యాణ్‌రామ్‌కు ఈ తరహా క్యారెక్టర్లు చేయడం కొట్టిన పిండి కావడంతో ఎంతో ఈజ్‌తో చేసినట్టు అనిపించింది. శ్రీకాంత్, పృథ్విరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ నటుడు సొహైల్ ఖాన్ ఈ సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. సినిమాలో అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రాన్ని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
![]() |
![]() |