![]() |
![]() |

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగగా, రెండో షెడ్యూల్ ఒరిస్సాలో ప్రారంభమైంది. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న 'SSMB 29'లో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. మహేష్ తండ్రిగా నానా పటేకర్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ఒక న్యూస్.. మహేష్ ఫ్యాన్స్ ని భయపెడుతోంది. (SSRMB)
'SSMB 29'లో మహేష్ పాత్ర పేరు రుద్ర అని ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమాల్లో ఆయన పోషించే పాత్రలు, ఆ పాత్రల పేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. పార్థు, పండుగాడు, అజయ్, సీతారామరాజు, రమణ ఇలా ఏ పాత్ర పోషించినా మహేష్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు రుద్ర పేరు కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. అయినప్పటికీ మహేష్ అభిమానుల్లో చిన్న భయం కనిపిస్తోంది. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'శక్తి' సినిమా అని చెప్పవచ్చు. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా అందులో ఒక పాత్ర పేరు రుద్ర. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలై, డిజాస్టర్ గా నిలిచింది. అందుకే రుద్ర పేరుని కొందరు మహేష్ ఫ్యాన్స్ నెగటివ్ గా ఫీలవుతున్నారు. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం.. అక్కడుంది దర్శకధీరుడు రాజమౌళి అని, ఒకవేళ క్యారెక్టర్ నేమ్ నిజంగానే రుద్ర అయినా అసలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అంటున్నారు. అయినా సినిమాలో విషయం ఉండాలి కానీ, పేరుది ఏముందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే 'కన్నప్ప'లో ప్రభాస్ పోషిస్తున్న అతిథి పాత్ర పేరు సైతం 'రుద్ర' కావడం విశేషం.
![]() |
![]() |