![]() |
![]() |
హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు సర్వసాధారణం. ఈ ధోరణి ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. టాలీవుడ్‌లో ఈ తరహా గొడవలు ఈమధ్యకాలంలో బాగా తగ్గాయి. ఒకటి, రెండు ఇష్యూలలో కొందరు హీరోల అభిమానులు తమ ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేశారు తప్ప ఓవరాల్‌గా చూస్తే అభిమానులు సంయమనంతోనే ఉంటున్నారు. అయితే తమిళనాడులో మాత్రం అక్కడి హీరోలకు అభిమానులు, వీరాభిమానులు, కరడు గట్టిన అభిమానులు ఇప్పటికీ వున్నారు. అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. ఈ విషయంలో మార్పు తీసుకురావాలని హీరోలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన అభిమానుల పట్ల హీరోలు ఎంత బాధ్యతగా ఉంటున్నారో తెలియజేస్తోంది.
రజినీకాంత్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాగే దళపతి విజయ్‌కి కూడా అభిమాన గణం ఎక్కువే. అందుకే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా సోషల్ మీడియాలో ఒకరినొకరు కామెంట్స్‌తో రచ్చ చేస్తుంటారు. అలా ఓ రజినీకాంత్ అభిమాని దళపతి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, అతన్ని దూషించాడు కూడా. అతను చేసిన కామెంట్స్ రజినీకాంత్ దృష్టికి వెళ్లాయి. వెంటనే ఆయన టీమ్ రంగంలోకి దిగి రజినీ అభిమానులకు ఒక వార్నింగ్ ఇచ్చింది. ‘రజినీకాంత్ అభిమాని అయి ఉండి మరో హీరో విజయ్ గురించి చెడుగా మాట్లాడడం చాలా తప్పు. నిజమైన రజినీ అభిమానులు అలాంటి పనులు చేయరు. సినిమా అనేది ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికే తప్ప వారి మధ్య గొడవలు సృష్టించడానికి కాదు. ఏ హీరో అభిమాని అయినా ఇతర హీరోల గురించి చెడుగా మాట్లాడి వారిపై దుష్ప్రచారం చేయకూడదు. మనకు ఇష్టమైన హీరోకి ఎంత గౌరవం ఇస్తున్నామో ఇతర హీరోలకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి’ అనే సందేశాన్ని రజినీకాంత్ టీమ్ సోషల్ మీడియా ద్వారా షేర్‌చేసింది.
![]() |
![]() |