![]() |
![]() |
.webp)
ఈమధ్యకాలంలో టాలీవుడ్ ప్రముఖులు పలు వివాదాల్లో ఇరుక్కొని విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు. ఎవరైనా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ట్రోలింగ్‌కి గురవుతామని తెలిసీ అలాంటి కామెంట్స్ చేస్తున్నారా లేక ట్రోలింగ్‌కి గురవ్వాలని చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎంత అలర్ట్‌గా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. కొందరు ప్రముఖులు ఎంతో సహజంగా మాట్లాడినా అందులోనూ కాంట్రవర్సీకి అవకాశం ఉన్న అంశాన్ని లేవనెత్తి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే.. భూతద్దం పెట్టి మరీ వివాదాన్ని వెలికి తీస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే ఏ సినిమా ఫంక్షన్‌కైనా వెళ్లాలంటే టాలీవుడ్ ప్రముఖులు వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. అయినా కొన్ని సందర్భాల్లో కొన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళకా తప్పదు, మాట్లాడకా తప్పదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఎదురైంది. ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమా ఫంక్షన్‌కి హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మ ఆనందం’ ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, గౌతమ్ తాతామనవళ్ళుగా నటించారు. దీంతో కార్యక్రమం నిర్వహిస్తున్న సుమ.. తాత అనే కాన్సెప్ట్‌లో చిరంజీవిని వారి తాత గురించి చెప్పమని అడిగారు. అది ఒక సరదా ప్రశ్నగా భావించిన చిరంజీవి.. ‘మా అమ్మగారి తండ్రి రాధాకృష్ణమనాయుడుగారు. నెల్లూరుకు చెందిన ఆయన మొగల్తూరులో సెటిల్ అయ్యారు. అక్కడ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా రిటైర్ అయ్యారు. ‘నీకు ఎవరి పోలికలైనా, బుద్ధయినా రావచ్చుగానీ ఆయన బుద్దులు మాత్రం రావొద్దురా’ అని మా పెద్దవాళ్ళు అనేవారు. ఎందుకంటే ఆయన పెద్ద రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు. ఇద్దరూ ఇంట్లో ఉండేవారు. వీళ్లిద్దరి మీద అలిగితే.. మూడో ఆమె దగ్గరకు వెళ్లేవారు. అలా మనకు తెలిసి ముగ్గురు ఉన్నారు. నాలుగైదు ఉన్నాయేమో మనకు తెలియదు. వాళ్లు చెప్పినట్టుగానే ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకోలేదు’ అన్నారు.
తాత గురించి చెప్పడం పూర్తయిన తర్వాత మనవడి ప్రస్తావన తీసుకొచ్చారు చిరంజీవి. రామ్‌చరణ్‌కి ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు మనవడు ఉంటే బాగుంటుందన్న కోరికను వెలిబుచ్చారు చిరంజీవి. ఆ విషయం గురించి మాట్లాడుతూ ‘మా ఇంట్లో అందరూ అమ్మాయిలే ఉన్నారు. వారి మధ్యలో నేను లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే చరణ్‌కి చెబుతుంటాను.. ఒక మగపిల్లాడిని కనరా అని. ఎందుకంటే మన లెగసీ కంటిన్యూ అవ్వాలి అంటే మగపిల్లాడు ఉండాలి. చరణ్‌కి క్లీంకార అంటే ఎంతో ముద్దు మళ్లీ అమ్మాయిని కంటాడేమో అని భయంగా ఉంది’ అంటూ సరదాగా తన మనసులోని కోరికను బయట పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన ఈ రెండు అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తన తాత గురించి పబ్లిక్‌గా చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమా తాతామనవళ్ళది అయినప్పుడు తాతతో తనకు ఉన్న మధుర జ్ఞాపకాల్ని చెప్పుకోవాలి తప్ప అతను చేసిన రాసలీలల గురించి చెప్పి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వయసులో పెద్దవారు అయి ఉండి, మెగాస్టార్‌గా అందరి అభిమానాన్ని పొందుతున్న చిరంజీవి మాట్లాడిన మాటలు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు అంటున్నారు.
అలాగే ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడారంటూ మరో వర్గం విరుచుకుపడుతోంది. మగపిల్లాడు అయితేనే తమ వారసత్వాన్ని కొనసాగిస్తాడు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యల వల్ల చాలా మంది నొచ్చుకున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఒక వేదిక మీద ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాంటి వ్యాఖ్యలు చేసిన చిరంజీవిపై మహిళా సంఘాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. పనిలో పనిగా పవన్‌కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఉన్న కొందరు మహిళా నాయకులు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి అలాంటి కామెంట్స్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
![]() |
![]() |