![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా 2020లో క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నాలుగు సంవత్సరాల్లో క్రిష్ ‘కొండపొలం’ అనే సినిమా పూర్తి చేసాడు. అది రిలీజ్ కూడా అయింది. ఈ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో వంటి సినిమాలు కూడా రిలీజ్ అయిపోయాయి. ‘హరిహర వీరమల్లు’ మాత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణం మరింత జాప్యం కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నాడు. బ్యాలెన్స్ వర్క్ జ్యోతికృష్ణ టేకప్ చేశాడు. ఈ సినిమా నిర్మాణం ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఒక సినిమా నిర్మాణం ఎంత లేట్ అయితే మేకర్స్‌లో అంత ఆందోళన ఉంటుంది. ‘హరిహర వీరమల్లు’ విషయంలో కూడా మేకర్స్ రకరకాల టెన్షన్స్‌కి గురవుతున్నారు. మార్చి 28న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే దానికి తగ్గట్టుగా వర్క్ జరగడం లేదు. పవన్‌కళ్యాణ్ పోర్షన్ మినహా మిగతా పార్ట్ అంతా కంప్లీట్ చేస్తున్నప్పటికీ మేజర్ వర్క్ హీరోతోనే ఉండడం వల్ల అతని డేట్స్ కోసం జ్యోతికృష్ణ, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. కేవలం నాలుగు రోజులు పవన్ డేట్స్ ఇస్తే చాలు అతనికి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు ఆ నాలుగురోజులే సినిమా పూర్తి కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి పవన్ ఆ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.
పవన్‌కళ్యాణ్ తన డేట్స్ ఇస్తేనే ‘హరిహర వీరమల్లు’ చిత్రం షెడ్యూల్ ప్రకారం విడుదలవుతుంది. అలా కాని పక్షంలో ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం పూర్తి కావడానికే ఇన్ని సంవత్సరాలు పడితే, ఇక రెండో భాగాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు అనే సందేహాలు కూడా అందరిలోనూ ఉన్నాయి. పవన్‌కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి బ్లాక్‌బస్టర్ చేసిన ఎ.ఎం.రత్నం.. ‘బంగారం’ వంటి ఫ్లాప్ మూవీ కూడా చేశారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ‘హరిహర వీరమల్లు’ నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
![]() |
![]() |