![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య 2023 డిసెంబర్ 22న విడుదలైన ‘సలార్’ అంచనాలకు తగ్గట్టుగానే భారీ విజయం సాధించింది. 270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లు కలెక్ట్ చేసింది. ‘సలార్ సీజ్‌ఫైర్’ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక పజిల్‌లా మారిపోయింది. ఈ సినిమా విషయంలో వారి మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రశాంత్ నీల్‌కి ఉంది. సినిమాలోని క్యారెక్టర్లు, వాటి మధ్య ఉన్న రిలేషన్, అసలు కథ ఎలా సాగుతోంది, ఎటు వెళ్తోంది అనే విషయాలు సాధారణ ప్రేక్షకులకు అర్థం కాలేదన్నది వాస్తవం. కేవలం ప్రభాస్ ఎలివేషన్, థ్రిల్ చేసే ఎపిసోడ్స్‌తోపాటు యాక్షన్ సీక్వెన్స్‌లు, టెక్నికల్ వేల్యూస్, డైరెక్టర్ టేకింగ్ తదితర అంశాలు.. కథ గురించి ఆలోచించనివ్వలేదు. థియేటర్ నుంచి బుర్రనిండా ప్రశ్నలతో బయటకు వచ్చారు ప్రేక్షకులు. అయితే ‘సలార్ శౌర్యాంగపర్వం’లో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాడులే అని ప్రేక్షకులు సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ‘సలార్2’ ఎప్పుడు వస్తుంది అనే విషయం సందిగ్థంలో పడింది.
సలార్ సీజ్‌ఫైర్‌తో ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ప్రశాంత్.. సలార్ శౌర్యాంగపర్వంతో మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉంది. మొదటి భాగంలోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అయితే ఇప్పుడు సలార్2పై సస్పెన్స్ నెలకొంది. కొందరు సలార్2 ఉంటుందా లేదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే సలార్2 తప్పకుండా ఉంటుందనేది వాస్తవం. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌నీల్ ఒక సినిమా చేస్తున్నారు. 2026లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నారు. కానీ, అది సాధ్యపడే విషయం కాదని అందరి భావన. ఇప్పటివరకు ప్రశాంత్ చేసిన సినిమా ఏదీ చెప్పిన టైమ్‌కి రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి 2026 ఎండింగ్‌కి రిలీజ్ అయినా అయినట్టే.
ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సలార్2 ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సలార్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌కే ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే షూటింగ్ ఎంతకాలం జరుగుతుంది అనేది తెలియాలి. ఎంత స్పీడ్‌గా చేసిన మినిమం రెండు సంవత్సరాలు షూటింగ్‌కి పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా తేలలేదు. ఏది ఏమైనా సలార్ 2 కోసం మరో నాలుగు సంవత్సరాలు ఆగక తప్పదు అనే విషయం అర్థమవుతోంది.
![]() |
![]() |