![]() |
![]() |

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్' (Thandel). చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. నాగ చైతన్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కోసం ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్ ని రంగంలోకి దింపుతున్నారు.
'తండేల్' తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. తమిళ ట్రైలర్ ను జనవరి 30 సాయంత్రం చెన్నైలో విడుదల చేయనున్నారు. తమిళ ట్రైలర్ లాంచ్ కోలీవుడ్ హీరో కార్తి చేతుల మీదుగా జరుగుతుండటం విశేషం. అక్కినేని ఫ్యామిలీతో కార్తికి మంచి అనుబంధం ఉంది. గతంలో నాగార్జునతో కలిసి 'ఊపిరి' సినిమాలో నటించాడు కార్తి.
అలాగే హిందీ ట్రైలర్ లాంచ్ కూడా జనవరి 31 సాయంత్రం ముంబైలో జరగనుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హాజరు కానున్నాడని సమాచారం. ఆమిర్ ఖాన్ తో 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ చిత్రంలో నాగ చైతన్య నటించిన సంగతి తెలిసిందే.
ఇక తండేల్ తెలుగు ప్రమోషన్స్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నట్లు వినికిడి. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన నిర్మాణ సంస్థ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే సినిమాల ప్రమోషన్స్ లో బన్నీ పాల్గొంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే తండేల్ కోసం ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగునాట ఘనంగా జరగనున్న తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడని సమాచారం.
![]() |
![]() |