![]() |
![]() |

సినిమా రంగం అనేది ఒక గ్లామర్ ప్రపంచం. అందులోకి ప్రవేశించాలని, ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అయితే వాటిని నిజం చేసుకునే అవకాశం కొందరికే దక్కుతుంది. నటుడిగా, నటిగా మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయికి రావడానికి ఎంతో కష్టపడతారు. ఆ తర్వాత దాన్ని కాపాడుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో వ్యక్తిగత ఆనందాలకు కూడా దూరం కావాల్సి ఉంటుంది. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే కొందరు ఆర్టిస్టులకు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలియని స్థితిలో ఉంటారు. ఇక భార్యాభర్తల్లో ఒకరు ఆర్టిస్ట్ అయితే వారి సంసార జీవితంలో కూడా ఆనందం కరువవుతుంది. ఆ విషయం గురించి సీనియర్ నటి అన్నపూర్ణ ప్రస్తావిస్తూ.. తన జీవితంలో జరిగిన సంఘటనను ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
‘నేను నాటకాలు వేస్తున్న రోజుల్లో ఒక వ్యక్తి నన్ను స్టేజ్ మీద చూసి ఇష్టపడ్డారు. అతన్నే పెళ్లి చేసుకున్నాను. నేను నటిగా బిజీగా ఉండేదాన్ని, అతను తన ఉద్యోగం వల్ల చాలా ఊర్లు తిరగాల్సి వచ్చేది. ఒక దశలో సినిమాలు మానెయ్యమన్నారు. ఇంటి పట్టున ఉంటే బాగుంటుంది అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలనేది ఆయన కోరిక. వైవాహిక జీవితంలో అలా ఆలోచించడం తప్పుకాదు. అయితే అది నా వల్ల కాలేదు. ఎందుకంటే, ఉదయం 7 గంటలకు షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలి. మద్రాస్‌లో విపరీతమైన వేడి ఉంటుంది. ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దయిపోతాం. ఇక శృంగార పరమైన ఆలోచన చేసే టైమేది? ఓపిక ఎక్కడుంటుంది? అందుకే మా ఆయనకు ఓ సలహా ఇచ్చాను. నేనెంత దుర్మార్గురాలిని అంటే.. మీకు అనుకూలంగా ఉంటూ ఇంటిపట్టున ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాను. ఆమెతో కాపురం చేసుకోమని మొహమాటం లేకుండా చెప్పాను. కానీ, ఆయన చాలా మంచివారు. నేను ఇచ్చిన ఆఫర్‌ని తీసుకోలేదు. నేను మాత్రం సినిమా రంగాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు’ అంటూ తన జీవితంలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలిపారు అన్నపూర్ణ.
![]() |
![]() |