![]() |
![]() |

హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో లెక్కకు మించిన పాటలు పాడి యూత్‌ని ఉర్రూతలూగించిన సింగర్ ఉషా ఉతుప్. సోమవారం ఆమె ఇంట విషాదం నెలకొంది. ఉషా భర్త జానీ చాకో(78) గుండెపోటుతో మరణించారు. ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. జానీని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆయన చనిపోయారని తెలిపారు.
ఉషాకు జానీ రెండో భర్త. మొదటి భర్త రాము చనిపోయిన తర్వాత జానీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సన్నీ, అంజలి. 76 సంవత్సరాల ఉషా ఉతుప్ 1966 నుంచి తన విలక్షణమై గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాప్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఉషా నటిగా కొన్ని హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ, ఇంగ్లీషు చిత్రాల్లో కనిపించారు. దాదాపు 60 సంవత్సరాలుగా కళారంగంలో ఉంటూ సేవలు అందిస్తున్న ఉషా ఉతుప్‌ను 2011లో పద్మశ్రీతో, 2024లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇవికాక ఆమె చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్‌కి వచ్చిన అవార్డులకు లెక్కే లేదు.
![]() |
![]() |