![]() |
![]() |
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లోనూ ఒక విశిష్టమైన హ్యాట్రిక్ బాలయ్య కెరీర్‌లో ఉంది. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి అలాంటి పవర్‌ఫుల్ మూవీస్ తాను తప్ప మరెవ్వరూ చెయ్యలేరని ప్రూవ్ చేశారు. సినిమాల్లో, రాజకీయాల్లో బాలకృష్ణ ఘనవిజయాలు అందుకోవడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలోనే జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 109వ సినిమాకి సంబంధించి అదేరోజున ప్రేక్షకులకు, అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్ ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అన్నింటినీ మించి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ2’ ప్రారంభోతవ్సం కూడా బాలకృష్ణ పుట్టినరోజునే జరగబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ ప్రజల మధ్యలో జరగబోతోందనే వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అది కూడా తనకు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ని అందించిన హిందూపూర్ ప్రజల మధ్య ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |