![]() |
![]() |
బెంగళూరు రేవ్ పార్టీ కేసు ఇటీవలి కాలంలో పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు నిందితురాలిగా పేర్కొంటున్న నటి హేమను సోమవారం అరెస్ట్ చేసి, బెంగళూరు దగ్గరలోని అనేకల్ జెఎంఎఫ్‌సి కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు హేమను విచారించిన పోలీసులు ఆమె నుంచి పలు కీలక సమాచారాన్ని సేకరించారు. ఐదుగురితో కలిసి హేమ ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచారు.
రేవ్ పార్టీకి సంబంధించిన పక్కా సమాచారంతో ఒక ఫామ్ హౌస్‌పై దాడి చేసిన పోలీసులు పార్టీలో పాల్గొనవారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ తన పేరును కృష్ణవేణిగా నమోదు చేయడంతో ఆమె పార్టీలో ఉన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తను హైదరాబాద్‌లోనే ఉన్నానని, రేవ్ పార్టీకీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ఓ వీడియో రిలీజ్ చేసింది హేమ. దాంతో ఆగకుండా మరో వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈలోగా బెంగళూరు పోలీసులు స్పందించి ఆమె తమ అదుపులోనే ఉందని ప్రకటించారు. తను హైదరాబాద్‌లోనే ఉన్నట్టు వీడియో షూట్ చేసిన ప్రదేశానికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పలువిధాల ప్రయత్నించిన హేమపై మరో కేసు నమోదైంది.
ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు రెండు సార్లు నోటీసులు పంపినా హేమ హాజరు కాకపోవడంతో మూడో నోటీసు కూడా జారీ చేశారు. సోమవారం బురఖా ధరించి విచారణకు హాజరైన హేమను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు మెడికల్ టెస్ట్‌లు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు చేసింది బెంగళూరు పోలీసులు కాబట్టి బెంగళూరు జైలుకే ఆమెను తరలించే అవకాశం ఉంది. కాగా, హేమకు నిర్వహించిన డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. మరోవైపు, హేమతోపాటు డ్రగ్ సరఫరా చేసిన షరీఫ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
![]() |
![]() |