![]() |
![]() |
సినిమా పుట్టిన నాటి నుంచి ఈ రంగంపై అందరికీ చులకన భావం ఉంది. సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయని, వారికి అన్ని దురలవాట్లు ఉంటాయని సాధారణ ప్రజలు భావించేవారు. ముఖ్యంగా మహిళలకు సినిమా రంగంలో భద్రత అనేది ఉండదని నమ్మేవారు. అందుకే పాత రోజుల్లో సినిమా రంగానికి వెళ్ళడానికి మహిళలకు ఎన్నో అవరోధాలు ఏర్పడేవి. కుటుంబ సభ్యులు తమ ఇంటి మహిళలు సినిమాల్లోకి వెళ్ళేందుకు ఇష్టపడేవారు కాదు. అయినా ఎంతోమంది నటీమణులు సినిమా రంగంలోకి వచ్చి తారాపథంలో దూసుకుపోయారు. అయితే కొందరు మాత్రం స్వయంకృతాపరాథం వల్ల కావచ్చు, సహనటులు మోసం చేయడం వల్ల కావచ్చు.. జీవితంలో అన్నీ కోల్పోయారు.
ప్రస్తుత జనరేషన్‌లో సినిమా ఇండస్ట్రీకి రావడానికి అన్ని అవరోధాలు ఉన్నట్టు కనిపించదు. అయితే ఈ రంగంలో మహిళలకు రక్షణ లేదని, సినిమా అవకాశం కావాలంటే ఎన్నో కోల్పోవాల్సి ఉంటుందనే విషయం బాగా ప్రచారంలో ఉంది. కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటే కమిట్‌మెంట్ పేరుతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారని చాలా సందర్భాల్లో రుజువైంది. దీనిపై గత కొంతకాలంగా పోరాటం కూడా జరుగుతోంది. ఇండస్ట్రీలోని అందరూ అలాంటి లైంగిక వేధింపులకు పాల్పడకపోయినా, కొందరి వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని మిగిలిన వారు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఓ నిర్మాత అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనవద్ద పనిచేస్తున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, దానికి సంబంధించిన వీడియోలతో ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ.
తమిళ సినీ రంగంలో నిర్మాతగా కొనసాగుతున్న మహ్మద్ అలీ కొన్ని సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలీ ఆఫీసులో గత ఏడాది కొరట్టూరుకు చెందిన ఓ యువతి చేరింది. అలీకి అప్పటికే పెళ్ళయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు. దాన్ని ఒక వీడియోగా చేసి ఆ యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భవతి కాగా, అబార్షన్ అయ్యేందుకు మాత్రలు ఇచ్చాడు. అతని ఆగడాలకు ఎదురు తిరిగితే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేక అంబత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను అలీ ఎలా మభ్యపెట్టాడో వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అలీని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
![]() |
![]() |