![]() |
![]() |

ఒక స్థలం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ని ఓ మహిళ మోసం చేసిందంటూ ఉదయం నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ టీం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ స్థలంతో ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.
2003లో సుంకు గీత అనే మహిళ నుంచి స్థలం కొనుగోలు చేశాడు ఎన్టీఆర్. అయితే ఆ స్థలాన్ని 1996లోనే బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకున్న గీత.. ఆ విషయాన్ని దాచి, ఎన్టీఆర్ కి స్థలం అమ్మారు. అంతేకాదు, ఆమె రుణాలు ఎగ్గొట్టడంతో బ్యాంక్ లు 'డెట్ రికవరీ ట్రిబ్యునల్'ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చింది. దీంతో తనను మోసం చేశారంటూ గీతపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ట్రిబ్యునల్ తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు, ఈ వివాదంలో ఉన్న స్థలం.. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబం నివాసముంటున్న ఇంటి స్థలంగా ప్రచారం జరిగింది. ఒకవేళ హైకోర్టులో చుక్కెదురైతే.. ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కోల్పోయే ప్రమాదం ఉందని న్యూస్ వినిపించింది. ఈ వార్తల నేపథ్యంలో, ఎన్టీఆర్ టీం కీలక ప్రకటన చేసింది. ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేశారని, ప్రస్తుతం అది ఆయన పేరు మీద లేదని క్లారిటీ ఇచ్చింది. అంటే.. ఆ స్థలం, ఎన్టీఆర్ నివాసముంటున్న ఇంటి స్థలం ఒకటి కాదన్నమాట.
ఎన్టీఆర్ టీం చెప్పినదానిని బట్టి చూస్తే.. ఆయన ఎవరికైతే స్థలం అమ్మారో వారికి బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చి ఉంటాయి. బ్యాంక్ నోటీసులు, ట్రిబ్యునల్ తీర్పుతో ఖంగుతిన్న వారు.. ఎన్టీఆర్ ని సంప్రదించి ఉంటారు. ఎన్టీఆర్ ద్వారా ఆ ప్రాపర్టీ మాజీ ఓనర్ గీత పేరు వెలుగులోకి వచ్చి.. ఆమెపై కేసు నమోదై ఉంటుంది.
![]() |
![]() |