![]() |
![]() |
లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో సాధారణ ప్రజలతోపాటు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ ప్రముఖులు.
ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అల్లు అర్జున్ తన ఓటు హక్కును జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్‌లో వినియోగించుకున్నారు. ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిచ్చారు బన్నీ.
మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్ లోని షేక్ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సిసిలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు తిరుపతి జిల్లాలోని ఎ.రంగంపేటలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ వాకర్స్ టౌన్ హాల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
![]() |
![]() |