![]() |
![]() |

వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని, హృదయాన్ని హత్తుకునే సినిమాలు చేస్తే.. ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. ఇటీవల విడుదలైన 'రాజధాని ఫైల్స్' చిత్రానికి థియేటర్, యూట్యూబ్, టీవీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగునాట సంచలనం సృష్టించింది. ఇటీవల యూట్యూబ్ లో విడుదల కాగా అక్కడా అదే జోరు చూపిస్తోంది.
'రాజధాని ఫైల్స్' ఫుల్ మూవీని తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ లో మే 4న సాయంత్రం విడుదల చేయగా.. వారం రోజుల్లోనే 8 లక్షలకు పైగా వ్యూస్ సాధించి, వన్ మిలియన్ దిశగా దూసుకుపోతోంది. ప్రతి రైతుబిడ్డ చూడాల్సిన చిత్రమంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ మూవీ క్లిప్స్ వైరల్ గా మారాయి.
ఇక ఆదివారం ఉదయం ప్రముఖ శాటిలైట్ ఛానల్ ఈటీవీలో 'రాజధాని ఫైల్స్' చిత్రాన్ని ప్రసారం చేయగా.. తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. ఈ చిత్రానికి రికార్డు టీఆర్పీ నమోదయ్యే అవకాశముంది అంటున్నారు.
అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన 'రాజధాని ఫైల్స్' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా రమేష్, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.
![]() |
![]() |