Home  »  News  »  'శబరి' మూవీ రివ్యూ

Updated : May 3, 2024

సినిమా పేరు: శబరి
తారాగణం: వరలక్ష్మీ శరత్ కుమార్, మైమ్ గోపి, గణేష్ వెంకట్రామన్, నివేక్ష, శశాంక్, మధునందన్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
రచన, దర్శకత్వం: అనిల్‌ కాట్జ్
నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల
బ్యానర్: మహా మూవీస్
విడుదల తేదీ: మే 3, 2024

'క్రాక్', 'నాంది', 'వీరసింహారెడ్డి', 'హనుమాన్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'శబరి'. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్(గణేష్ వెంకట్రామన్)ని కాదనుకొని.. తన కూతురు రియా(నివేక్ష)ను తీసుకొని ముంబై నుంచి వైజాగ్ వస్తుంది సంజన(వరలక్ష్మీ శరత్ కుమార్). తన స్నేహితుడు, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్ గా ఉద్యోగంలో చేరుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో సంజనకు ఊహించని సమస్య ఎదురవుతుంది. సైకోగా మారిన సూర్యం(మైమ్ గోపి) అనే వ్యక్తి.. రియా తన బిడ్డని, తనకి అప్పగించకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగుతాడు. మరోవైపు సంజన భర్త అరవింద్ కూడా తన కూతురిని తనకి అప్పగించాలంటూ కోర్టుని ఆశ్రయిస్తాడు. అసలు రియా ఎవరి కూతురు? అరవింద్ కి, సూర్యంకి ఏమైనా సంబంధం ఉందా? అరవింద్ కి సంజన దూరం కావడానికి కారణమేంటి? తన కూతురు రియాని దక్కించుకోవడం కోసం సంజన ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఈ సృష్టిలో తల్లి ప్రేమని మించింది లేదు. అన్ని ప్రేమల్లోనూ తల్లి ప్రేమే గొప్పది. తన బిడ్డ కోసం తల్లి ఎవరినైనా వదులుకుంటుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, ప్రపంచాన్ని అయినా ఎదిరిస్తుంది. అలాంటి ఓ తల్లి కథే ఈ 'శబరి'. అయితే దర్శకుడు దీనిని సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు. ఈ తరహా సినిమాలలో బలమైన భావోద్వేగాలతో పాటు, ఊహించని మలుపులు కూడా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

చిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమైన సంజనగా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర పరిచయం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరమై ఒంటరిగా కూతురిని చూసుకోవడం.. వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. సంజన పాత్రని, అందులోని ఎమోషన్ ని పరిచయం చేస్తూ.. నెమ్మదిగా కథలోకి వెళ్తుంది. సైకో సూర్యం పాత్ర రాకతో కథలో వేగం పెరుగుతుంది. తరువాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు కట్టి పడేశాయి. సెకండాఫ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. సెకండాఫ్ లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మొత్తానికి ఓ వైపు బిడ్డ కోసం తల్లి చేసే పోరాటం, మరోవైపు ఊహించని ట్విస్ట్ లతో సినిమా మెప్పించింది. అయితే సినిమాలో ప్రతిదీ డిటైల్డ్ గా చూపించే ప్రయత్నం చేయడంతో.. కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఆ విషయంపై దృష్టి పెట్టినట్లయితే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.

సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. గోపిసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా ఆయన నేపథ్యం సంగీతం ఉంది. రాహుల్, నాని కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
బిడ్డను కాపాడుకోవడం కోసం పోరాడే సింగిల్ మదర్ సంజన పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. తన సహజమైన నటనతో మెప్పించింది. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి కూడా మ్యాజిక్ చేశాడు. అరవింద్ గా గణేష్ వెంకట్రామన్, రియాగా నివేక్ష ఆకట్టుకున్నారు. శశాంక్, మధునందన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..
కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి చేసే పోరాటమే ఈ 'శబరి' చిత్రం. కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. బలమైన భావోద్వేగాలు, ఊహించని మలుపులు సినిమాని నిలబెట్టాయి. హత్తుకునే మదర్ సెంటిమెంట్, థ్రిల్ ఇచ్చే ట్విస్ట్ ల కోసం ఈ సినిమాని హ్యాపీగా చూసేయొచ్చు.

రేటింగ్: 2.75/5 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.