![]() |
![]() |
చాలా మంది హీరోలు తమ పిల్లలు కూడా సినిమా రంగంలో రాణించాలని, తమ నటవారసులుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. ఆడపిల్లల సంగతి పక్కన పెడితే.. మగ పిల్లల్ని హీరోలుగా వారు చూడాలనుకోవడం సహజం. సినిమా రంగంలోని పాత తరం హీరోల నుంచి ఇది ఆనవాయితీ వస్తోంది. అలా ఎంతో మంది వారసులు సినీ పరిశ్రమలో ప్రవేశించి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే పిల్లలను సినిమా రంగం నుంచి దూరంగా ఉంచేందుకు కొందరు హీరోలు ప్రయత్నిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ విషయంలో అదే పద్ధతిని అవలంబించారు చిరు. అతని చిన్నతనంలో ‘రాజా విక్రమార్క’, ‘లంకేశ్వరుడు’, ‘ఆపద్బాంధవుడు’.. ఈ మూడు సినిమాల షూటింగ్‌కి మాత్రమే చరణ్‌ని తీసుకెళ్ళారు చిరంజీవి. ఇక ఆ తర్వాత సినిమాలకు సంబంధించి ఎటువంటి విషయాలు చరణ్ దరిదాపులోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే దాని వెనుక ఒక బలమైన కారణమే ఉంది. చదువుకునే వయసులో సినిమాలపై ధ్యాస పెట్టకూడదన్నది చిరు అభిప్రాయం. సినిమాలకు సంబంధించిన వాతావరణం ఇంట్లో ఉండకుండా చూసుకునేవారు చిరు. అందుకే చరణ్‌కి చిన్నతనంలో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తను చదువుకునే రోజుల్లో ఇంట్లో సినిమా పోస్టర్లు, సినిమా పత్రికలు లాంటివి చూడొద్దనే నిషేధాన్ని పెట్టారు. తనకు వచ్చిన అవార్డులను సైతం ఆఫీస్‌కే పరిమితం చేశారు తప్ప ఇంటి వరకు వెళ్ళనివ్వలేదు చిరు. ఇదిలా ఉంటే.. 8వ తరగతి చదువుతున్నప్పుడు చరణ్‌కి సినిమా పత్రిక చూడాలనిపించింది. ఇంట్లో ఎవరూ లేరనుకొని మ్యాగజైన్ చూడడం మొదలుపెట్టాడు. అయితే దాన్ని చిరంజీవి చూశాడు. తను చేసిన పనికి చరణ్ వణికిపోయాడు. అతను చేసిన పనికి ఆరోజు ఇంట్లో పెద్ద చర్చ జరిగింది. హైస్కూల్ స్టడీస్ పూర్తయిన తర్వాతే చరణ్‌కి సినిమా ఫ్రీడమ్ ఇచ్చారు చిరు.
సినిమా మ్యాగజైన్ చూసినందుకే భయపడిపోయిన చరణ్.. పెద్దయిన తర్వాత తన డాన్స్‌తో, పెర్‌ఫార్మెన్స్‌తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం విశేషమనే చెప్పాలి. చిన్నతనంలో ఎంతో బిడియంగా ఉండేవాడు చరణ్. ఇంట్లో జరిగే ఫంక్షన్లలో అల్లు అర్జున్, శిరీష్ స్టెప్పులేస్తుంటే అలా చూసేవాడే తప్ప కాలు కదిపేవాడు కాదు. చిరంజీవికి చరణ్‌ని హీరోగా చూడాలనే కోరిక ఉంది కాబట్టి అతను కూడా తనలాగే డాన్స్‌లో మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఉండేవాడు. కానీ, చరణ్ అలాంటి ప్రయత్నాలు ఏవీ చేయకపోవడంతో ‘వీడు అసలు డాన్స్ చెయ్యగలడా?’ అనే సందేహం కూడా చిరుకి వచ్చిందట. ఆ విషయం తెలుసుకున్న చరణ్.. తండ్రి తన నుంచి ఏం ఆశిస్తున్నాడో గ్రహించాడు. ఇక అప్పటి నుంచి ట్రైనింగ్ లేకుండా సొంతంగా డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు తండ్రిని మించిన గొప్ప డాన్సర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు.
‘చిరుత’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు చరణ్ ప్రయాణం అమోఘం!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’తో హీరోగా పరిచయమైన చరణ్... మొదటి సినిమాతోనే అందర్నీ ఆకర్షించాడు. ‘చిరుత’నయుడుగా తన సత్తా ఏమిటో చూపించాడు. డాన్స్‌లో, ఫైట్స్‌లో, పెర్‌ఫార్మెన్స్‌లో తండ్రికి ఏమాత్రం తాను తీసిపోనని ప్రూవ్ చేసుకున్నాడు. 2007లో విడుదలైన ఈ సినిమాలోని అతని పెర్‌ఫార్మెన్స్‌కి స్పెషల్ జ్యూరీ నంది అవార్డు గెలుచుకున్నాడు. ఉత్తమ నూతన నటుడుగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకున్నాడు. తొలి సినిమా తనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. నెక్స్‌ట్ ఏంటి.. అని ఆలోచిస్తున్న సమయంలోనే ఒక అద్భుతమైన, అపురూపమైన అవకాశం ‘మగధీర’ రూపంలో వచ్చింది. అప్పటికే సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు వంటి బ్లాక్‌బస్టర్స్‌తో టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. వచ్చిన ఆ అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని రెండో సినిమాతోనే స్టార్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు చరణ్. ‘మగధీర’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రూ.150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి కూడా ఉత్తమ నటుడుగా స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలతో హీరోగా తన రేంజ్‌ని మరింత పెంచుకుంటూ వస్తున్న చరణ్‌ని ‘రంగస్థలం’ మరో మెట్టు ఎక్కించింది. ఇక ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చరణ్‌ని గ్లోబల్ స్టార్‌ని చేసేసింది.
కేవలం 14 సినిమాలతోనే హీరోగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చరణ్... ఇప్పుడు శంకర్ కాంబినేషన్‌లో చరణ్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’తో కెరీర్ పరంగా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’పై ప్రేక్షకుల్లో, మెగాభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా తర్వాత చరణ్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడమే కష్టం అంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆశించినట్టుగానే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మార్చి 27 రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.
![]() |
![]() |