![]() |
![]() |

సినిమా పేరు: అన్వేషిప్పిన్ కండెతుమ్
నటీనటులు: టోవినో థామస్, సిద్దిఖి, ఆర్తన బిను, ఇంద్రన్స్, ఆధ్య ప్రసాద్ తదితరులు
కథ: జిను అబ్రహం
ఎడిటింగ్: సైజు శ్రీధరన్
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: గౌతమ్ శంకర్
నిర్మాతలు: జిను అబ్రహం, సౌరబ్ అరోరా
దర్శకత్వం: డార్విన్ కురియకోస్
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
మలయాళం సినిమాలలో పాపులర్ అయిన టోవినో థామస్ స్టోరీ సెలెక్షన్ భిన్నంగా ఉంటుంది. టోవినో థామస్ నటించిన పోలీసు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'అన్వేషిప్పిన్ కండెతుమ్' తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
చింగావనం అనే ఊరిలో ఆనంద్ నారాయణ్(టోవినో థామస్) సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తుంటాడు. ఒకరోజు లవ్ లీ అనే అమ్మాయి కనపడటం లేదని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇస్తాడు. ఆనంద్ నారాయణ్ అతడి టీమ్ కలిసి నిందితుడు ఎవరో కనిపెడతారు. అతడిని పట్టుకొని కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తారు. అక్కడ పోలీసుల దగ్గర నుండి తప్పించుకొని రైలుకింద పడిపోయి చనిపోతాడు. దీంతో నిందితుడు చనిపోవడానికి పోలీసులే కారణమని ఆనంద్ నారాయణ్, అతడి టీమ్ ని సస్పెండ్ చేస్తారు. కొన్నాళ్ళకు ఆనంద్ ని డీఎస్పీ పిలిపించి.. ఓ అమ్మాయి చనిపోయిందని, తనని ఎవరు చంపారో తెలియదని క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆఫీసర్స్ అందరు ఇన్వెస్టిగేషన్ చేసినా కేసు ఆచూకీ తెలియదని, ఆ నేరస్తుడెవరో మీరు కనిపెట్టాలని చెప్తాడు. ఇక ఆనంద్ అతడి టీమ్ కలిసి ఆ ఊరికి వెళ్తారు. అక్కడ ఊరిలోని వాళ్ళంతా పోలీసులకి వ్యతిరేకంగా ఉంటూ.. వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. అయితే ఆ శ్రీదేవీని చంపిందెవరో ఆనంద్ నారాయణ్ కనిపెట్టాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో ఉండే కిక్కే వేరు. అందులోను మలయాళం సినిమాలకి ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. ఒకే సినిమాలో రెండు కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్ ని ఇస్తుంది. ఈ థ్రిల్ ని ప్రేక్షకులకి పంచడంలో 'అన్వేషిప్పిన్ కండెతుమ్' మూవీ సక్సెస్ అయింది. దర్శకుడు ఫస్టాఫ్ లో ఒక కేసుని, సెకండాఫ్ లో మరో కేసుని సాల్వ్ చేస్తూ గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తిని రేకెత్తించాడు.
మొదటి కేసులో అసలు నేరస్తుడిని కనిపెట్టడానికి ఆనంద్ నారాయణ్ ( టోవినో థామస్) చేసిన గెస్సింగ్, సాక్ష్యం కోసం అతను చేపించిన ఫేక్ దొంగతనం కేసుని ఇన్వెస్టిగేషన్ చూపిస్తూ ప్రేక్షకుడిని కళ్ళుతిప్పుకోనీయకుండా చూసేలా చేస్తాయి. సినిమాలో ప్రతీ సీన్ కేసుని పరిష్కరించడం వైపుగా సాగుతూ ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా.. పాటలు, ఫైట్స్, బిల్డప్ షాట్స్ ఏవీ లేకుండా అలా తీసుకెళ్ళారు. ఇక పోలీసులలో జరిగే సీనియర్, జూనియర్ ఆఫీసర్ ల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ సాగే సీన్స్ ఆలోచింపజేసేవిలా ఉంటాయి. అయితే శ్రీదేవీ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసే విధానంతో అందరు కనెక్ట్ అవుతారు.
1980- 90 మధ్యకాలంలో సాగే కథ కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీసుల డ్రెస్సులు, ఇంట్లో ఉండే టెలిఫోన్, చెరువులో స్నానాలు ఇలా అన్ని చోట్ల.. ఆ కాలం నాటి పరిస్థితులని, వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో మేకర్స్ బాగా కష్టపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక మర్డర్ కేసు మిస్టరీ కోసం ఢిల్లీ, గుర్గావ్ వెళ్ళకుండా బస్సులో వెళ్ళే ఓ ప్యాసింజర్ ద్వారా సమాచారాన్ని చేరవేయడం ఆకట్టుకుంటుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అశ్లీల పదజాలం ఎక్కడా వాడలేదు. స్క్రీన్ ప్లే సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఎడిటింగ్ బాగుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందరికి నచ్చేస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడ్డ కష్టం స్క్రీన్ మీద తెలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
సబ్ ఇన్ స్పెక్టర్ ఆనంద్ నారాయణ్ గా టోవినో థామస్ ఒదిగిపోయాడు. ఆ పాత్ర కోసమే అతను పుట్టినట్టుగా నటించేశాడు. సిద్దిఖి డీస్పీగా ఆకట్టుకున్నాడు. ఇక మిగతావారంతా వారి పాత్రలకి న్యాయం చేశారు. ఎవరి ప్రాధాన్యత వారికి ఉంది.
ఫైనల్ గా చెప్పాలంటే..
ఈ మధ్యకాలంలో వచ్చిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలలో 'అన్వేషిప్పిన్ కండెతుమ్' మంచి థ్రిల్ ని ఇస్తుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు.
రేటింగ్: 3/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |