![]() |
![]() |
సినిమా రంగంలో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది వస్తుంటారు. కానీ, అందరికీ అవకాశాలు దొరకవు. కొందరికి అవకాశాలు వస్తాయి, ఎన్నో సినిమాల్లో నటిస్తారు, నటిగా మంచి పేరు తెచ్చుకుంటారు. కొందరు వారు చేసే పొరపాట్ల వల్ల వ్యక్తిగత జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. అలాంటి ఓ నటి జీవితం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన విజయలక్ష్మీ 1997లో నటిగా సినీరంగంలో ప్రవేశించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రం ‘హనుమాన్ జంక్షన్’, ‘పృథ్వీనారాయణ’ చిత్రాల్లో నటించింది. 2018 వరకు సినిమాల్లో నటించిన విజయలక్ష్మీ ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
తాజాగా ఓ సెల్ఫీ వీడియోతో మీడియా ముందుకు వచ్చింది విజయలక్ష్మీ. ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె ఏం మాట్లాడిందంటే... ‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 29న తమిళ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో కలిసి మాట్లాడాలని, కలిసి జీవితం పంచుకోవాలని ఎంతో ఆవేదనతో వీడియో చేసి తనకు పంపించాను. అంతే కాదు ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పాను. ఇప్పటికి ఐదు రోజులు పూర్తయింది.. తన నుంచి ఎలాంటి స్పందన లేదు. పెళ్లి పేరుతో నాతో మూడేళ్ళ పాటు రహస్య జీవితాన్ని గడిపారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నారు. నా జీవితాన్ని సీమాన్ నాశనం చేశారు. నన్ను నడి రోడ్డు పై వదిలేశారు. ప్రస్తుతం నేను కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మానవత్వంతో ఎవరైనా సహకరించినా తమిళ కట్చి నేత సీమాన్ వారిని తరిమి కొడుతున్నారు. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను.. ఇదీ ఆ సెల్ఫీ వీడియోలోని సారాంశం.
ఆత్మహత్యా యత్నం చేయడం విజయలక్ష్మీకి కొత్తేమీ కాదు. 2006లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తనని పెళ్ళి చేసుకోవాలని వేధించడంతో అది తట్టుకోలేక నిద్ర మాత్రలు మోతాదుకి మించి తీసుకొని మొదటిసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అదే సంవత్సరం కన్నడ నటుడు సృజన్ లోకేష్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. 2007లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. మూడు సంవత్సరాలపాటు ఇద్దరూ డేటింగ్‌లో ఉన్న తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది.
2020 ఫిబ్రవరిలో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది విజయలక్ష్మీ. తమిళ కట్చి నేత సీమాన్ తనతో సహజీవనం చేసాడని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని అతనిపై పోలీస్ కేసు పెట్టింది. అయినా అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోగా అతని మనుషులు విజయలక్ష్మీని వేధించడం మొదలు పెట్టారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియో రిలీజ్ చేసి బి.పి. టాబ్లెట్స్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు.
![]() |
![]() |