![]() |
![]() |

సమ్మర్ మొదలైందంటే తెలుగునాట సినిమా సందడి మొదలైనట్టే. మార్చి నుంచి మొదలై మే వరకు ఈ సందడి ఉంటుంది. ఈసారి మార్చి 1 నుంచే సినిమాల హడావుడి షురూ అయింది. మార్చి 1న 'ఆపరేషన్ వాలెంటైన్', 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'చారి 111' వంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఇక ఈ వారం కూడా భారీగానే సినిమాలు సందడి చేయనున్నాయి.
మార్చి 8న 'భీమా', 'గామి', 'ప్రేమలు' సినిమాలు విడుదల కానున్నాయి. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'భీమా'. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించాడు. గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గోపీచంద్ కటౌట్ కి తగ్గ కంటెంట్ దొరికిందనే అభిప్రాయాన్ని కలిగించాయి. ఇటీవల గోపీచంద్ ట్రాక్ రికార్డు బాలేనప్పటికీ.. మాస్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందనేది వాస్తవం. సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయగలడు. ఆ సరైన సినిమా 'భీమా' అవుతుందేమో చూడాలి.
ఇటీవల ట్రైలర్ తోనే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సినిమా అంటే 'గామి' అని చెప్పవచ్చు. విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ అడ్వెంచర్ ఫిల్మ్ ట్రైలర్ కట్టిపడేసింది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటమే కాకుండా.. విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయనే పేరు తెచ్చుకుంది. ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూసి అనుభూతి చెందటానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది.
ఇటీవల పలు మలయాళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిలో 'ప్రేమలు' ఒకటి. ఇది హైదరాబాద్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ కావడం విశేషం. ఇప్పటికే మలయాళ వెర్షన్ ని కొందరు తెలుగు ప్రేక్షకులు కూడా చూశారంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఉంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని రాజమౌళి తనయుడు కార్తికేయ సొంతం చేసుకున్నాడు. గోపీచంద్, విశ్వక్ సేన్ సినిమాలతో పాటు మార్చి 8న విడుదలవుతున్న 'ప్రేమలు' చిత్రంపై యువత బాగానే ఆసక్తి చూపే అవకాశముంది. ఇక ఈ వారంలోనే మార్చి 9న 'రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి' అనే సినిమా కూడా విడుదల కానుంది. మరి ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.
![]() |
![]() |