![]() |
![]() |
నేచురల్ స్టార్ నాని.. ఈ పేరు తెచ్చుకోవడం వెనుక ఓ కథ ఉంది.. ఎంతో కృషి ఉంది. ఇండస్ట్రీలో మెగాస్టార్, సూపర్‌స్టార్, ఎనర్జిటిక్ స్టార్, స్టైలిష్‌స్టార్.. ఇలాంటి స్టార్ హీరోలు టాలీవుడ్‌ని ఏలుతున్న తరుణంలో నేచురల్ స్టార్‌ని నేనున్నానంటూ ముందుకొచ్చాడు నాని. అతనికి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు, సొంతంగా సినిమా తీసి హీరోగా నటించేంత ఆర్థిక స్తోమత లేదు. కానీ, సినిమా ఇండస్ట్రీలో రాణించాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది. వాస్తవానికి అతనికి నటించే ఆసక్తి లేదు. కానీ, ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నాడు. తన సినిమాలతో నేచురల్ స్టార్ అనిపించుకోవడం వెనుక ఉన్న ఒకే ఒక కారణం.. అతని లుక్ ఓ హీరోలా కాకుండా నెక్స్‌ట్ డోర్ బోయ్‌లా ఉంటుంది. మన మధ్య, మన ఇంటిలోనే తిరిగే కుర్రాడిలా కనిపిస్తాడు. అదే అతన్ని నేచురల్ స్టార్‌ని చేసింది.
నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. 1984 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో జన్మించాడు. సెయింట్ ఆల్ఫోన్సా హైస్కూల్‌లో పదో తరగతి చదివిన నాని.. ఎస్.ఆర్.నగర్‌లోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత వెస్లీ కాలేజ్‌లో డిగ్రీ చదివాడు. చదువుకునే రోజుల నుంచే నానిపై మణిరత్నం ప్రభావం విపరీతంగా ఉంది. ఆయన సినిమాలంటే ఎంతో ఇష్టపడేవాడు. ఆయనలా సినిమాలు తియ్యాలని, మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. ఆ కోరికతోనే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత దర్శకత్వ శాఖలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరికి బాపు దర్శకత్వంలో రూపొందిన ‘రాధాగోపాళం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దగ్గర, మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘అస్త్రం, ఢీ’ చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాడు. ఆ తర్వాత ఓ స్నేహితురాలి సలహా మేరకు రేడియో జాకీగా పనిచేశాడు.
ఆ సమయంలోనే మోహనకృష్ణ ఇంద్రగంటి ‘అష్టా చమ్మా’లో ఓ యంగ్ హీరో కోసం అన్వేషిస్తున్నారు. అంతకుముందు పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన నాని గురించి తెలుసుకొని అతన్నే తన సినిమాలో హీరోగా ఎంపిక చేసుకున్నారు. మోహనకృష్ణ సినిమాలు ఎంతో నేచురల్‌గా, మరెంతో సెన్సిబుల్‌గా ఉంటాయి. అది నానికి బాగా కలిసొచ్చింది. ఎలాంటి హైప్ లేని ఒక సాధారణ కుర్రాడి పాత్రలో నాని తన నటనతో మెప్పించాడు. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. చక్కని ఎంటర్‌టైనర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా రీచ్ అయింది. దాంతో నెక్స్‌ట్ డోర్ బోయ్ అనే కాంప్లిమెంట్ దక్కించుకున్నాడు. ‘రైడ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమిందార్’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్ యంగ్ హీరో అనిపించుకున్నాడు.
ఆ టైమ్‌లోనే దర్శకుడు రాజమౌళి దృష్టి నానిపై పడిరది. తను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి రూపొందించే ‘ఈగ’ చిత్రంలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. రాజమౌళి వంటి అగ్ర దర్శకుల సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా చాలు అని ఎదురుచూసే ఎంతో మంది నటీనటులు ఉన్నారు. అలాంటిది నానికి ఏకంగా హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా కూడా సూపర్‌హిట్ అవ్వడంతో ఒక్కసారి అతనికి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. దాన్ని కాపాడుకునేందుకు ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తున్నాడు, విజయాలు అందుకుంటున్నాడు.
హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి మేరకు సినిమాలు నిర్మిస్తున్నాడు నాని. ‘డి ఫర్ దోపిడి’ చిత్రానికి సహ నిర్మాతగా మారిన నాని, తరువాత ‘అ! చిత్రాన్ని కూడా భాగస్వామ్యంలోనే నిర్మించారు. ఆ తర్వాత ‘హిట్: ద ఫస్ట్ కేస్’, ‘హిట్ : ద సెకండ్ కేస్’ చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ విజయం సాధించాడు. తన సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ అనే ఆంథాలజీ నిర్మించారు. గత సంవత్సరం ‘దసరా’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ సాధించిన నాని ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. అలాగే ‘బలగం’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ చిత్రంలో కూడా నాని హీరోగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌తో ‘ఓజి’ చిత్రాన్ని రూపొందిస్తున్న సుజిత్ ఆ సినిమా తర్వాత నానితో ఓ సినిమా ప్లానింగ్‌లో ఉందని తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్టుల గురించి అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగి అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాలు చేస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న నేచురల్‌స్టార్ నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.
![]() |
![]() |