![]() |
![]() |

ఇటీవల పలు సినిమాలు రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొదటి భాగం హిట్ అయితే.. దర్శకులు ఇతర ప్రాజెక్ట్ ల జోలికి పోకుండా.. వెంటనే తమ తదుపరి సినిమాగా రెండో భాగం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే 'సలార్' విషయంలో ప్రశాంత్ నీల్ మాత్రం 'నా రూటే సెపరేట్' అంటున్నాడు.
'బాహుబలి' ఫ్రాంచైజ్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారితే, 'కేజీఎఫ్' సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన చిత్రం 'సలార్'. 'బాహుబలి', 'కేజీఎఫ్' బాటలోనే ఇది కూడా రెండు భాగాలుగా రానుంది. ఇప్పటికే మొదటి భాగం 'సీజ్ ఫైర్' గతేడాది డిసెంబర్ 22న విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, విజయం సాధించింది. దీంతో ఈ సినిమా రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పట్లో సలార్ పార్ట్-2 వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'కల్కి 2898 AD', 'రాజా సాబ్', 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కావాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో ఓ సినిమా, అలాగే యశ్ తో 'కేజీఎఫ్-3' కమిట్ అయ్యి ఉన్నాడు. అయితే 'సలార్-2' కంటే ముందు ప్రశాంత్ నీల్ ఈ రెండు ప్రాజెక్ట్ లని పూర్తి చేయనున్నాడట.
కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ వేసవికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. దానిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, సెప్టెంబర్ నాటికి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి అందుబాటులోకి వస్తాడట. ఇక యశ్ కూడా 'టాక్సిక్' అనే సినిమాతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ 'రామాయణ' చేయనున్నాడు. యశ్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసేలోపు.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత యశ్-ప్రశాంత్ కాంబినేషన్ లో 'కేజీఎఫ్-3' పట్టాలెక్కే అవకాశముంది. ఈలోపు ప్రభాస్ కూడా తన కమిట్ మెంట్స్ పూర్తి చేస్తే.. 'కేజీఎఫ్-3' తర్వాత 'సలార్-2' మొదలయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
![]() |
![]() |