![]() |
![]() |

సినిమా వారు రాజకీయాల్లోకి రావడం చాలా సాధారణ విషయమైపోయింది. ఎందరో తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ప్రస్తుతం రాజకీయాలన్నీ సినిమా వారి చుట్టూ తిరుగుతున్నాయి. సినిమా నేపథ్యం నుండి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన వారిలో ఎం.జి.ఆర్, జయలలిత ఉన్నారు. ఇదే బాటలో పయనిస్తూ ఎందరో తారలు తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు. విజయ్ కాంత్ కొంతవరకు రాజకీయాల్లో రాణించినప్పటికీ ముఖ్యమంత్రి స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎంతగానో తపించిన రజినీకాంత్.. చివరికి ఆరోగ్యం సహకరించట్లేదని చేతులెత్తేశారు. కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయినప్పటికీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న తమిళ హీరోల లిస్టు ఇంకా పెరుగుతూనే ఉంది.
ఇటీవల తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు దళపతి విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'తమిళ వెట్రి కళగం' పేరుతో పార్టీని అనౌన్స్ చేసిన ఆయన.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేసి.. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో పయనించడానికి మరో హీరో విశాల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సినిమా, రాజకీయ పరమైన వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు విశాల్. గతంలోనే ఆర్కే నగర్ ఉపఎన్నికల బరిలో నిలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని విశాల్ భావించగా.. అప్పుడు ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది. అయితే ఇప్పుడాయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ విశాల్ ఎప్పటినుంచో చేసుకుంటున్నాడట. తన అభిమాన సంఘం 'విశాల్ మక్కల్ నల ఇయక్కం' ద్వారా హీరో విశాల్ ఎప్పటినుంచో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జిల్లాల వారీగా ఇన్ ఛార్జులను నియమించి.. స్థానిక ప్రజల సమస్యలు, అవసరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజల జీవన విధానం, రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహనకు వచ్చిన విశాల్.. తన అభిమాన సంఘం నేతలతో సమావేశంపై త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు వినికిడి. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో తాను సేవా కార్యక్రమాలు చేయట్లేదని, ప్రస్తుతం పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని విశాల్ చెబుతున్నప్పటికీ.. తెర వెనుక మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వర్క్ జరుగుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
ఇప్పటికే తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, ఎంఎన్ఎం సహా పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్, విశాల్ పార్టీలు కూడా తోడైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారతాయి అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |