![]() |
![]() |

విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'గీత గోవిందం'. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 2018లో విడుదలై ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. రూ.70 కోట్లకు పైగా షేర్ తో రూ.130 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. విజయ్ కెరీర్ లోనే కాదు, మీడియం రేంజ్ సినిమాలలో సైతం ఇదే టాప్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన 'హనుమాన్' ఆ రికార్డుని బ్రేక్ చేసింది. ఈ సినిమా పది రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా షేర్, రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. తేజ లాంటి కుర్ర హీరో వంద కోట్ల షేర్ ఫీట్ సాధించడంతో.. యూత్ లో క్రేజ్ ఉన్న విజయ్ వంటి హీరోలకు ఇప్పుడది కొత్త టార్గెట్ గా మారిందని చెప్పవచ్చు.
నిజానికి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'తో ఈజీగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబడతానని విజయ్ భావించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ టాక్ తో కనీసం రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో కూడా చేరలేదు. అయితే విజయ్ త్వరలోనే 'ఫ్యామిలీ స్టార్'తో 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్-పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా 'సీతా రామం', 'హాయ్ నాన్న' వంటి విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడం అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఈ సినిమాకి మరో అంశం కలిసి రానుంది. అదే రిలీజ్ డేట్.
ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన 'దేవర' వాయిదా పడటంతో ఆ తేదీపై 'ఫ్యామిలీ స్టార్' కన్నేసింది. ఉగాది, శ్రీరామ నవమి వంటి పండగలు, పబ్లిక్ హాలిడేస్ కలిసొచ్చేలా అదిరిపోయే రిలీజ్ డేట్ ని 'దేవర' టీం లాక్ చేసుకోగా.. ఇప్పుడు ఆ డేట్ 'ఫ్యామిలీ స్టార్'కి కలిసిరానుంది. పైగా అప్పటికి టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా ముగుస్తాయి. ఇక ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత కావడంతో.. భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతుంది అనడంలో సందేహం లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. హిట్ కాంబినేషన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సమ్మర్ సీజన్, పబ్లిక్ హాలిడేస్, దిల్ రాజు వంటి అంశాలన్నీ కలిసొచ్చి రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నా ఆశ్చర్యంలేదు. మరి 'ఫ్యామిలీ స్టార్' కూడా 'గీత గోవిందం' మాదిరిగా విజయ్ కి బిగ్గెస్ట్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |