Home  »  News  »  భారతదేశంలోనే ఎవరికీ దక్కని గౌరవం ఎన్టీఆర్ సొంతం!

Updated : Jan 18, 2024

నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూపా మరియు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీ టి. ప్రసన్న కుమార్, ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మరియు ఎక్స్ కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. "మరణం లేని మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది అలాగే సినీ పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎదురులేని మనిషిగా నిలబడిన వ్యక్తి. ఆయన భౌతికంగా మనకు దూరమై 28 ఏళ్లు గడిచిన ఆయన్ని ఇలా సత్కరించుకోవడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. భారతదేశంలోనే ఎవరికీ దక్కని గౌరవం ఆయన సొంతం. ఫిలింనగర్ కు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలి అని గవర్నమెంట్ కి విన్నవించుకుంటున్నాము. 1982లో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా పార్టీ పెట్టి నా లాంటి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. యావత్ భారత దేశంలో తెలుగువారు ఉన్నంతకాలం నందమూరి తారక రామారావు గారిని మరవడం అనేది చాలా కష్టం. ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన పథకాలే దేశం అంతటా ఈరోజుకి ఉండటం ఆ పథకాలనే ఇప్పటికీ అమలు చేయడం అనేది గర్వించదగ్గ విషయం. ప్రతి ఏటా కూడా ఇలాగే ఎన్టీఆర్ గారి జయంతి వర్ధంతి చాలా ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాం" అన్నారు.

నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ.. "మరణం లేని తెలుగు జాతి గౌరవం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు భౌతికంగా మా నుండి దూరమై 28 ఏళ్లు గడిచిన మనసా - ఆలోచనల్లోనూ, వాచా - మా మాటల్లోనూ, కర్మణా - మా చేతల్లోనూ మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పెను సంచలనం. సినిమాల్లో గాని, రాజకీయాల్లో గాని ఎన్టీఆర్ అనే పేరు చెరగని ముద్ర వేసుకుంది. సినిమాల్లో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. కథానాయకుడు గానే కాకుండా ప్రతి నాయకుడు పాత్రల్లో కూడా నటించి మెప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. భగవంతుడిగా ఉన్నత క్యారెక్టర్లు నటించారు డీ గ్లామరైజ్డ్ రోల్ కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తిగా రాజు పేదలో నటించారు. రాజకీయాల్లోపరంగా కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని  స్థాపించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ గారే ఆద్యుడు. ఆయన ఎప్పుడూ అందరివాడే. ఈరోజు అన్ని పార్టీలు కూడా ఆయన పేరుని ఆయన సంక్షేమ పథకాలను వాడుకుంటున్నాయి. ఆయన ఎప్పుడూ అజాతశత్రువే. దైవం మనుష్య రూపేనా అన్నట్టు ఎన్టీఆర్ గారు మనుషులలో దైవం. ఆయనకు నివాళులర్పించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి కాజా సూర్యనారాయణ గారికి, మాగంటి గోపీనాథ్ గారికి, భాస్కర్ నాయుడు గారికి  మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారికి కృతజ్ఞతలు" అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. "మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ గారు. సినిమా ఇండస్ట్రీలో రారాజుక ఒక రాముడు గా చేసినా ఒక రావణుడిగా చేసినా ఒక కృష్ణుడిగా చేసినా ఒక దుర్యోధనుడిగా చేసినా నందమూరి తారక రామారావు గారే. నాయకుడిగా ప్రతి నాయకుడిగా ఇరుపాత్రలతోను మెప్పించగల హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారే. హిందీలో మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న హీరో అదే విధంగా హాలీవుడ్ లో కృష్ణుడు పాత్రకి అడిగినా బాలీవుడ్ లో అడిగినా ఆ పాత్రలను తిరస్కరించి నేను తెలుగు వాడిని, తెలుగు వాళ్లకే సొంతం, తెలుగు వాళ్లకే నా సేవలు అంకితం అని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ పాన్ ఇండియా, హాలీవుడ్, బాలీవుడ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాం కానీ ఇవన్నీ ఆయనకు ఎప్పుడో వచ్చినా తిరస్కరించి తెలుగు జాతి కోసమే నిలబడిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లో రోజుకు లక్ష రూపాయలు తీసుకున్న నటుడు లేడు అలాంటిది ఎన్టీఆర్ గారు రోజుకు లక్ష రూపాయలు తీసుకున్నా నటిస్తూ తన కోసమో తన కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం ఏదైనా చేయాలి అని పార్టీ పెట్టి సంపాదించిన దాంట్లో ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఫిలిం నగర్ లో ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది అని మనం గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పే లాగా ఈ రోజున ఈ  కార్యక్రమం జరగడం ప్రతి తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాజా సూర్యనారాయణ గారికి, మాగంటి గోపీనాథ్ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి, నందమూరి మోహన రూపా గారికి మరియు భాస్కర్ నాయుడు గారికి ధన్యవాదాలు." అన్నారు.

ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ.. "నందమూరి తారకరామారావు గారు విగ్రహం ఫిలింనగర్లో ఉండడానికి కారణమే నందమూరి మోహనకృష్ణ గారు. ఆ రోజున ఆయన ఈ విగ్రహం ఇక్కడ పెట్టించి ఉండకపోతే ఈరోజు ఈ  విగ్రహం ఇక్కడ ఉండేది కాదు. అదేవిధంగా ఆరోజు ఈ విగ్రహావిష్కరణ చేసింది మాగంటి గోపీనాథ్ గారు. ఎన్టీఆర్ గారికి మేము శిష్యులమే కాదు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం మా అదృష్టం కూడా. ఈనాటికీ ఆయన మనల్ని వదిలి వెళ్లి 28 సంవత్సరాలు అయ్యింది. దేశమంతటా ఆయన విగ్రహాలు ఎక్కడున్నా ఆ విగ్రహాలను పూజించుకుని ఆయన స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు.

నందమూరి మోహన రూపా మాట్లాడుతూ.. "విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మన అన్నగారైన నందమూరి తారక రామారావు గారు. ఈ పేరు ప్రతి తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ఆ మహనీయుని తలవని రోజు అంటూ ఉండదు. ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ప్రతి తెలుగువాడు రోజు తలుచుకునే పూజించే దైవం ఎన్టీఆర్ గారు. ఆయన ఎప్పటికీ మనలోనే మనతోనే ఉంటారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాజా సూర్యనారాయణ గారికి, మాగంటి గోపీనాథ్ గారికి, భాస్కర్ నాయుడు గారికి మరియు ప్రసన్నకుమార్ గారికి నా ధన్యవాదాలు" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.