![]() |
![]() |

ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో ప్రధాన పోటీ 'గుంటూరు కారం', 'హనుమాన్' సినిమాల మధ్య నెలకొంది. అలాగే కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తమ సినిమాకి థియేటర్లు దొరక్కుండా చేశారని 'హనుమాన్' టీం ఆరోపిస్తే, తమ సినిమాపై కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నారని 'గుంటూరు కారం' టీం ఆరోపించింది. మరోవైపు 'నా సామి రంగ' టీంకి కూడా థియేటర్ల విషయంలో అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో ఈ సంక్రాంతి సినిమాల గురించి మాస్ మహారాజా రవితేజ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా రవితేజ చేసిన వ్యాఖ్యలను దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. సినిమాల గురించి మాస్ మహారాజా గోల్డెన్ వర్డ్స్ చెప్పారని, ఆయనది హ్యాపీయెస్ట్ సోల్ అంటూ హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశాడు. "ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు. ఎవడన్నా, పక్కోడి అపజయానికి సోలో డాన్స్ ఏస్తే, రేపు వాడి అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారు" అని రవితేజ కామెంట్స్ చేసినట్లుగా హరీష్ శంకర్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అసలు రవితేజ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడని, ఆయన చేసిన కామెంట్స్ ని హరీష్ ఇలా పబ్లిక్ గా పోస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
![]() |
![]() |