![]() |
![]() |
.webp)
సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, అంతు పట్టని విధంగా కూడా ఉంటాయి. అందులో ఒకటి కాంబినేషన్. కొందరు హీరోలు, డైరెక్టర్లకు కాంబినేషన్లు బాగా వర్కవుట్ అవుతాయి. ఒకే కాంబినేషన్‌లో చేసిన ఎన్నో సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. అలాగే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్కో కాంబినేషన్‌కి హిట్ అనేది దక్కదు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా అలాంటిదే. తన మాటల గారడీతో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేసిన త్రివిక్రమ్.. నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో రెండో సినిమా సూపర్‌స్టార్ మహేష్‌తో చేసే అవకాశం వచ్చింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ చిత్రం వల్ల నిర్మాత మురళీమోహన్ ఎంతో నష్టపోయారు. ఈ సినిమాకి థియేటర్లలో ఆదరణ లభించలేదు. టీవీలో మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయి 18 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వ్యూయర్ షిప్ బాగా ఉంటుంది. ఆ తర్వాత మహేష్‌తో త్రివిక్రమ్ చేసిన ‘ఖలేజా’ పరిస్థితి కూడా అంతే. థియేటర్లలో కంటే టీవీలో చూసేందుకే ప్రేక్షకులు మొగ్గు చూపారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ విషయంలో ఎన్నో మార్పులు జరిగాయి. మరోపక్క సినిమాకి తమన్ సరైన మ్యూజిక్ ఇవ్వలేదని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. జనవరి 7న ‘గుంటూరు కారం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీనిపై ఓ కొత్త ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అదేమిటంటే.. 6 సంవత్సరాల క్రితం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ చిత్రం వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా అదే పరిస్థితి వస్తుందా అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది. ‘అజ్ఞాతవాసి’ చిత్రం ట్రైలర్ జనవరి 7న రిలీజ్ అయింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ ట్రైలర్ కూడా జనవరి 7నే రిలీజ్ అయింది. అంతేకాదు జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ సెంటిమెంట్‌తో మరోసారి మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఫెయిల్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాల్లాగే ‘గుంటూరు కారం’ కూడా టీవీకే పరిమితం అవుతుంది అనే న్యూస్‌ని సర్క్యులేట్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం అంటున్నారు. ఇన్ని రకాల రూమర్ల మధ్య రిలీజ్ అవుతున్న ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్‌ని ఘాటెక్కిస్తుందా.. లేక చప్పబడిపోతుందా.. వెయిట్ అండ్ సీ.
![]() |
![]() |