![]() |
![]() |

తారాగణం: ఆకాశ్, భావన, తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్, మహాదేవ్, మధులత, సుధాకర్ రెడ్డి, సాహితి
సంగీతం: శాండిల్య(పాటలు), సురేష్ బొబ్బిలి(నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రాఫర్: గంగనమోని శేఖర్
ఎడిటర్: రాఘవేంద్ర వర్మ
రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్
నిర్మాత: కె. రాఘవేంద్రరావు
బ్యానర్: ఆర్కే టెలీ షో
విడుదల తేదీ: జనవరి 1, 2024
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం 'సర్కారు నౌకరి'. 1996లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ, కండోమ్ లు పంచే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో ఆకాష్ నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తొలి ప్రయత్నం ఆకాష్ కి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
గోపాల్(ఆకాష్) అనాథ. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ.. కష్టపడి చదివి ప్రభుత్వం ఉద్యోగం తెచ్చుకుంటాడు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి హెల్త్ ప్రమోటర్ గా వెళ్తాడు. ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ, కండోమ్ లు పంచడం అతని డ్యూటీ. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతనికి, అతని భార్య సత్య(భావన)కు మొదట్లో గ్రామస్థులు ఎంతో గౌరవం ఇస్తారు. అయితే గోపాల్ చేసే పని కండోమ్ లు పంచడం అని తెలిశాక.. అతన్ని హేళన చేయడమే కాకుండా, అతని కుటుంబాన్ని అంటరానివారిగా చూస్తుంటారు. ఆ అవమానాలు తట్టుకోలేక.. ఉద్యోగం మానేసి వేరే ఊరికి వెళదామని భార్య సత్య కోరుతుంది. కానీ గోపాల్ ఎంత చెప్పినా వినడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలై, సత్య పుట్టింటికి వెళ్తుంది. ఉద్యోగం కోసం గోపాల్ భార్యను కూడా ఎందుకు కాదనుకున్నాడు? అవమానాలు ఎదురవుతున్నా అదే ఉద్యోగం చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? అసలు గోపాల్ గతం ఏంటి? కొల్లాపూర్ తో అతనికి సంబంధమేంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
1996లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. ప్రస్తుతం యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో ఇలా ఎయిడ్స్ నేపథ్యంలో సినిమాని రూపొందించడం సాహసమనే చెప్పాలి. ఇప్పుడు అవగాహన ఉన్నట్టుగా ఒకప్పుడు ప్రజలకు ఎయిడ్స్ పై అంతగా అవగాహన ఉండేది కాదు. ఈ మహమ్మారి కారణంగా అప్పట్లో ఎందరో మరణించారు. ఎయిడ్స్ సోకిన వారిని, వారి కుటుంబాలను అందరూ అంటరానివారిగా చూసేవారు. గ్రామాల నుంచి వెలివేసేవారు. ఎయిడ్స్ పై అవగాహన కల్పించే హెల్త్ వర్కర్లను కూడా చిన్నచూపు చూసేవారు. ఆనాటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు.
ఇలాంటి కథని వినోదం, భావోద్వేగాలతో నడిపించి ప్రేక్షకులను కట్టిపడేయవచు. అయితే అందులో దర్శకుడు కొంతవరకే సక్సెస్ అయ్యాడు. కండోమ్ లు పంచడానికి హీరో పడే అవస్థలు, వాటిని బుడగలు అనుకొని పిల్లలు ఆడుకోవడం వంటి సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే ఆ నవ్వుల డోస్ మరింత పెంచి ఉంటే బాగుండేది. అలాగే ఇలాంటి సున్నితమైన కథలను తీసుకున్నప్పుడు, భావోద్వేగాలు మనసుకి హత్తుకునేలా, ఆలోచింపజేసేలా ఉండాలి. ఈ క్రమంలో దర్శకుడు ఆర్ట్ ఫిల్మ్ లా నెమ్మదిగా సినిమాని నడిపించాడు. మరీ మెలోడ్రామాలా సాగింది. కథనంపైనా, సన్నివేశాల రూపకల్పనపైనా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. దర్శకుడు తాను అనుకున్న కథని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ దానికి కమర్షియల్ హంగులు కూడా తోడైతే మెరుగైన ఫలితం వచ్చే అవకాశముండేది.
శాండిల్య పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం పరవాలేదు. శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
ఆకాష్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ గోపాల్ పాత్రలో సహజంగా నటించి మెప్పించాడు. గోపాల్ భార్య సత్యగా భావన ఆకట్టుకుంది. తనికెళ్ళ భరణి, మధులత, మహాదేవ్, సాయి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, సాహితి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
దర్శకుడు ఎంచుకున్న కథా నేపథ్యం బాగున్నప్పటికీ, కథని నడిపిన తీరు మాత్రం మెప్పించలేకపోయింది. చిత్ర బృందం చేసిన విభిన్న ప్రయత్నం కోసం, అక్కడక్కడా నవ్వించే హాస్య సన్నివేశాలు, హత్తుకునే భావోద్వేగాల కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
![]() |
![]() |