![]() |
![]() |
ఒకప్పుడు సినిమా సూపర్‌హిట్ అయ్యింది అంటే.. ఆ సినిమా ఎన్ని సెంటర్స్‌లో 50 రోజులు ఆడిరది, ఎన్ని సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది, ఎన్ని కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీకి వెళ్లింది అనే అంశాలనే లెక్కలోకి తీసుకునేవారు. అప్పట్లో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమానే కాబట్టి కలెక్షన్లు కూడా బాగానే వచ్చేవి. టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వివిధ మాధ్యమాల్లో లభ్యం కావడంతో ఇప్పుడు కనీసం 50 రోజులు థియేటర్లలో ఆడే సినిమాలు కూడా లేవు. ఇప్పుడేదైనా రోజుల లెక్కే. ప్రపంచవ్యాప్తంగా ఏరోజు ఎంత కలెక్ట్ చేసింది అనేది లెక్కలోకి తీసుకుంటున్నారు. తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్ట్ చెయ్యాలంటే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చెయ్యాలి. ఇప్పుడు టాప్ హీరోల సినిమాలకు అదే జరుగుతోంది. వెయ్యికోట్లు టార్గెట్‌గా టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో షారూక్‌ఖాన్ నటించిన పఠాన్ 1000 కోట్లు కలెక్ట్ చేయగా, ఆ తర్వాత షారూక్ హీరోగానే రూపొందిన జవాన్ కూడా 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇటీవల రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ చిత్రం 900 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకి వచ్చిన బజ్‌కి, కలెక్ట్ చేసిన ఎమౌంట్‌కి పొంతన లేదన్నది యానిమల్ చిత్ర నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా అభిప్రాయం.
ఈమధ్య ఓ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో జరుగుతున్న కార్పొరేట్ బుకింగ్ స్కామ్ గురించి వివరించాడు. వంగా బ్రదర్స్, బాలీవుడ్ రివ్యూ రైటర్స్ కలిసి అక్కడ జరుగుతున్న కార్పొరేట్ బుకింగ్ స్కామ్‌ను బయటపెట్టారు. హిందీ రివ్యూ రైటర్స్ డబ్బు తీసుకొని రేటింగ్ తక్కువ ఇస్తారని డైరెక్టర్ సందీప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బాలీవుడ్ హీరోలు ఫాలో అయ్యే కార్పోరేట్ బుకింగ్ స్కామ్‌ను ఫాలో అయి వుంటే ‘యానిమల్’ మూవీ ఎప్పుడో వెయ్యికోట్లు దాటి ఉండేదని వ్యాఖ్యానించారు. కొందరు బాలీవుడ్ హీరోల మాదిరిగా కార్పొరేట్ బుకింగ్ స్కామ్‌ని తాము ఫాలో అవ్వలేదని, ఇప్పటివరకు ‘యానిమల్’కి వచ్చినవి నిజమైన కలెక్షన్లని నిర్మాత అంటున్నారు.
అసలు కార్పొరేట్ బుకింగ్ స్కామ్ అంటే ఏమిటి.. స్టార్ హీరోల సినిమా రిలీజ్ అయినపుడు, సినిమాకి అంత బజ్ లేనపుడు, ఓపెనింగ్స్ మీద డౌట్ ఉన్నప్పుడు హీరో లేదా నిర్మాతలకు సంబంధించిన వ్యక్తి బల్క్‌గా టిక్కెట్స్ అన్నీ బుక్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని కంపెనీలకు ఆ టిక్కెట్స్‌ను ఫ్రీగా పంపిణీ చేస్తారు. దీంతో థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ అయినట్టు చూపిస్తుంది. సినిమా పెద్ద హిట్ అయ్యిందని జనం కూడా నమ్మేస్తారు. కార్పొరేట్ బుకింగ్ స్కామ్‌తో ఈజీగా వెయ్యికోట్లు కలెక్షన్ వచ్చేస్తుంది. కొందరు స్టార్ హీరోలకు కొన్ని కంపెనీలతో లింకులు ఉన్నాయని, వాటి ద్వారా సినిమాకి హైప్ తీసుకొస్తారని అంటున్నారు వంగా బ్రదర్స్. షారూక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ వెయ్యి కోట్ల మార్క్‌ను దాటాయి. వంగా బ్రదర్స్.. షారూక్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
మరోపక్క బాలీవుడ్ మీడియా సౌత్ సినిమాలను తక్కువ చేస్తోందనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. కావాలనే సౌత్ సినిమాల గురించి బ్యాడ్‌గా రాస్తున్నారని బాలీవుడ్ మీడియాను విమర్శిస్తున్నారు. దీని ప్రభావం ఇప్పుడు సలార్‌పై పడిరది. సలార్ కంటే ఒకరోజు ముందు డంకీ విడుదలైంది. ఆ సినిమాకి హైప్ తీసుకొచ్చేందుకు సలార్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. డంకీ విషయంలో డైరెక్ట్‌గా షారూక్ రంగంలోకి దిగి థియేటర్ల విషయంలో జోక్యం చేసుకున్నాడు. సలార్ చిత్రానికి పివిఆర్, ఐనాక్స్ వంటి సంస్థలు చివరి నిమిషం వరకు అడ్వాన్స్ టిక్కెట్స్ ఓపెన్ చేయకపోవడంతో ఈ సినిమా నార్త్‌లో ఎక్కువగా నష్టపోయింది. షారూక్ ‘డంకీ’కి హైప్ తీసుకురావడం కోసం అక్కడి మీడియా కూడా బాగా కృషి చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి విమర్శలపై బాలీవుడ్ ప్రముఖులు, బాలీవుడ్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి.
![]() |
![]() |