![]() |
![]() |

సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపించే యంగ్ స్టార్స్ లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఈ ఏడాది ఆయన రెండు పూర్తి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించాయి. ప్రథమార్థంలో 'దసరా'తో మాస్ హిట్ ని, ద్వితీయార్థంలో 'హాయ్ నాన్న'తో క్లాస్ హిట్ ని అందుకున్నాడు. అంతేకాదు ఈ రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది నూతన దర్శకులే కావడం విశేషం.
నాని పూర్తిస్థాయి మాస్ అవతార్ లో దర్శనమిచ్చిన సినిమా 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. మార్చి 30న విడుదలైన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ధరణిగా నాని నటనకు అందరూ ఫిదా అయ్యారు. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా రూ.115 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది.
'దసరా' వంటి మాస్ హిట్ తర్వాత, 'హాయ్ నాన్న' లాంటి పూర్తి క్లాస్ సినిమాతో ఈ ఏడాది మరోసారి ప్రేక్షకులను పలకరించాడు నాని. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాతో శౌర్యువ్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం, దసరా స్థాయి వసూళ్లు సాధించినప్పటికీ.. మంచి వసూళ్లతో పది రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి, క్లాస్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఒకే ఏడాది రెండు విభిన్న తరహా సినిమాలతో, ఇద్దరు దర్శకులను పరిచయం చేసి.. రెండు విజయాలను సొంతం చేసుకోవడం నానికే చెల్లిందని చెప్పవచ్చు.
![]() |
![]() |