![]() |
![]() |

నేడు పన్నెండున్నర కోట్ల మంది తెలుగు ప్రజల అభిమాన కధానాయకుడు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు. ఈ రోజుతో ఆయన 63 సంవత్సరాలని పూర్తి చేసుకొని 64 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. 1986 లో వచ్చిన కలియుగ పాండవులతో చిత్ర రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ ఇప్పటివరకు 72 చిత్రాల్లో నటించాడు.వీటిల్లో చాలా సినిమాలు ఆయన తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదగడానికి దోహదపడ్డాయి. అలాగే ఆయా సినిమాలు సినీ పరిశ్రమలో తెరకెక్కే కథల విధానంలోనే ఒక ట్రెండ్ ని సృష్టించాయి. ఆ టాప్ సినిమాలు ఏవో చూద్దాం.
1 .స్వర్ణ కమలం: కె.విశ్వనాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ వెంకటేష్ లో దాగి ఉన్న ఒక గొప్ప నటుడుని బయటకి తీసుకొచ్చింది. వంశ పారంపర్యంగా తన తండ్రి నుంచి సంక్రమించిన ఒక అధ్బుతమైన నృత్యకళ తనలో దాగి ఉందని ఒక బ్రాహ్మణ అమ్మాయి( భానుప్రియ ) గ్రహించలేక పోతుంది. పైగా ఆ కళ ని అవమానపరుస్తు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఆశపడుతుంటుంది. అప్పుడు వెంకటేష్ ఆమెలో దాగి ఉన్న నృత్య కళ ఎంత పరమ పవిత్రమైనదో గుర్తు చేసి ఆమెని ఒక గొప్ప నృత్యకళాకారిణిగా తీర్చుదిద్దుతాడు. ఈ సినిమా వెంకటేష్ కి లేడీస్ లో విపరీతమైన ఫాన్స్ ని తెచ్చిపెట్టింది.
2 .ప్రేమ: ఈ సినిమాతో వెంకటేష్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఒక అనాధ యువకుడుగా, సింగర్ గా ,ప్రేమించిన అమ్మాయి( రేవతి) ప్రాణాల కోసం పరితపించే యువకుడుగా వెంకటేష్ నటనకి తెలుగు ప్రజానీకం మొత్తం జేజేలు పలికింది.ఈ రోజుకి ఈ సినిమాలోని ప్రియతమా నా హృదయమా అనే సాంగ్ చాలా చోట్ల మారుమోగిపోతూనే ఉంటుంది. అలాగే వెంకటేష్ కి ఉత్తమ నటుడుగా నంది అవార్డు ని కూడా ప్రేమ మూవీ తెచ్చిపెట్టింది.
3 .బొబ్బిలి రాజా: సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రెకార్డులన్నింటిని తుడిచిపెట్టింది. తన తల్లి మీద పడ్డ పతిత అనే నిందని చెరిపివేసి మినిస్టర్ అయిన తన అత్తకి బుద్ది చెప్పే క్యారక్టర్ లో వెంకటేష్ నటన నభూతో నభవిష్యతు అనే విధంగా ఉంటుంది. అలాగే హీరోయిన్ దివ్యభారతి తో వెంకటేష్ చేసిన రొమాన్స్ అండ్ కామెడీ కోసమే రిపీటెడ్ గా జనం థియేటర్స్ కి క్యూ కట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా ఈ రోజుకి మారుమోగిపోతుంటాయి.ఈ చిత్ర సంగీత దర్శకుడు ఇళయరాజాకి ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఈ సినిమాతో వెంకటేష్ కి మాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
4 .శత్రువు: తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ఈ సినిమాలో వెంకటేష్ నటనని చూస్తున్న ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి. అనాధ అయిన వెంకటేష్ ని ఒక లాయర్ పెంచి పెద్ద చేసి తనని కూడా లాయర్ ని చేస్తాడు. ఆ తర్వాత వెంకటరత్నం( కోట శ్రీనివాసరావు ) అనే ఒక కాంట్రాక్టర్ కొంత మందితో కలిసి వెంకటేష్ ని పెంచి పెద్ద చేసిన లాయర్ ని హత్య చేస్తాడు. దీంతో వెంకటేష్ చట్టానికి దొరకకుండా వెంకటటరత్నాన్ని అతనికి సహకరించిన వాళ్ళందర్నీ చంపుతాడు. విజయశాంతి వెంకటేష్ సరసన హీరోయిన్ గా చేసింది. కోడి రామకృష దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒక సినిమాని నడిపించే విధానంలో కథనం ఈ విధంగా ఉండాలో చెప్పే ఒక పాఠ్య గ్రంధం అని చెప్పవచ్చు.
5 .చంటి: ఈ సినిమా చూడటానికి ఎన్నో గ్రామాలకి చెందిన ప్రజలు తమ భార్య పిల్లలతో కలిసి ఎడ్ల బండ్లు ట్రాక్టర్ లు వేసుకొని వెళ్లే వారంటే ఈ సినిమాలో వెంకటేష్ ఏ రీతిలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్చించాడో అర్ధం చేసుకోవచ్చు. కేవలం పాట, ప్రేమ, మంచి తనం తప్ప లోక జ్ఞానం తెలియని చంటి( వెంకటేష్ ) ఒక జమీందారుల ఇంట్లో పనికి చేరతాడు. ఆ తర్వాత ఆ జమిందారుల చెల్లలు( మీనా) చంటి ని ప్రేమించి చంటి చేత తన మెడలో తాళి కట్టించుకుంటుంది. ఆ తర్వాత తాళికి అసలు అర్ధం తెలుసుకున్న చంటి తన తల్లి సలహా మేరకు దూరంగా వెళ్ళిపోతాడు. కానీ చంటి విషయం తెలుసుకున్న జమీందారులు చంటి తల్లిని చంపబోతే చంటి వాళ్ళందరిని కొట్టి తన కోసం చావబోతున్న మీనా ప్రేమని అర్ధం చేసుకొని తనని దక్కించుకుంటాడు.
6 .సుందరకాండ: ఈ సినిమాతో వెంకటేష్ కామెడీ ని కూడా సూపర్ గా చేయగలడని అందరికి అర్ధం అయ్యింది. లెక్చరర్ అయిన తనని ఒక లేడీ స్టూడెంట్( అపర్ణ ) ప్రేమిస్తే ఆమె ప్రేమ నుంచి తప్పించుకోవడానికి వెంకటేష్ చేసే ప్రయత్నాలు సూపర్ కామెడీ తో ఉంటాయి. అలాగే ఒక అనాధ అమ్మాయిని (మీనా ) పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి నుంచి కూడా వెంకీ పడే ఇబ్బందులు ప్రేక్షకులకి విపరీతమైన నవ్వులని తెప్పిస్తాయి.

7 .ప్రేమించుకుందాం రా : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఈ సినిమా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది. ఈ సినిమాతోనే తెలుగు సినిమా రంగంలో రాయలసీమ కథల ట్రెండ్ ప్రారంభం అయ్యింది. రాయలసీమలో ఉన్న తన అక్క బావల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక కరుడు గట్టిన ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని ( అంజలి ఝవేరి ) ప్రేమించి ఆ తర్వాత ఆ ఫ్యాక్షనిస్ట్ ని వెంకటేష్ ఎలా ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ. చాలా థియేటర్స్ లో 50 రోజులు పాటు కంటిన్యూగా హౌస్ ఫుల్ బోర్డు లు తో ఈ సినిమా నడిచిందంటే ప్రేమించుకుందాంరా విజయం తాలూకు రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.
8 .రాజా : చిన్న చిన్న దొంగ తనాలు చేసుకొనే రాజా( వెంకటేష్ ) అనే ఒక దొంగ ఒక అమ్మాయిని (సౌందర్య ) ని ప్రేమించి ఆ అమ్మాయి కోసం మంచి వాడిగా మారతాడు. ఆ తర్వాత సౌందర్య ని ఆమె కుటుంబం మొత్తం ఇంట్లోనుంచి వెళ్లగొడితే ఆశ్రయమిస్తాడు.అంతే కాకుండా సౌందర్యంలో దాగి ఉన్న సింగర్ ని బయటకి తీసి ఆమె పెద్ద సింగర్ అయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మీద ఉన్న తన ప్రేమని చంపుకొని సౌందర్య తన కుటుంబం చెప్పిన వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వెళ్లి పోతాడు. వెంకటేష్ నటనా విన్యాసాన్ని చూడటానికి రాజా సినిమా ఒకటికి పది సార్లు చూసిన వాళ్ళు కోకొల్లలు.
9 . కలిసుందాం రా : 2000 వ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎన్నో రికార్డులని పక్కకునెట్టి సరికొత్త రికార్డులని కలిసుందాం రా సినిమా సృష్టించింది. అలాగే ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతని కూడా ఈ సినిమా తెలిపింది. ప్రేమ ,ఆప్యాయతలు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ ఇనిస్పిరేషన్ గా తీసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి. తన మరదలు( సిమ్రాన్ ) ని ప్రేమించి తన తాత కోసం ఆ ప్రేమని చంపుకునే క్యారెక్టర్ లో వెంకటేష్ నటన కి తెలుగు ప్రేక్షకులు మొత్తం నీరాజనాలు పలికారు.
10 : నువ్వు నాకు నచ్చావు: ఈ సినిమాలో వెంకటేష్ ప్రదర్శించిన ఈజీ నటనని చూసి సినీ విమర్శకులందరు ముక్కున వేలేసుకున్నారు. భీమవరం నుంచి తన తండ్రి స్నేహితుడి ఇంటికొచ్చి ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిన తన తండ్రి స్నేహితుడి కూతురు ( ఆర్తి అగర్వాల్ ) ప్రేమ నుంచి తప్పించుకోవాలనుకునే క్యారక్టర్ లో వెంకటేష్ నటనకి అందరు ఫిదా కావలసిందే. వెంకటేష్ నటనలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ ని ఈ చిత్రం ప్రేక్షకులకి పరిచయం చేసింది.
ఇలా పై న చెప్పుకున్న సినిమాల ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వెంకటేష్ తన కంటు ఒక బెంచ్ మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆ చిత్రాల ద్వారా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిన వెంకటేష్ మరెన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. మల్లేశ్వరి, సంక్రాంతి, ఘర్షణ ,ఆడవారి మాటలకి అర్ధాలు వేరులే, లక్ష్మి ,తులసి ,ఈనాడు, నమో వేంకటేశ, బాడీ గార్డ్, దృశ్యం ,గోపాల గోపాల,నారప్ప ఇలా పలు చిత్రాల్లో నటించి అశేష సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని పొందారు. త్వరలో సైంధవ్ అనే ఒక డిఫెరెంట్ మూవీ తో మళ్ళీ ఇంకో కొత్త మార్కుని చూపించడానికి వస్తున్నాడు.
![]() |
![]() |