Home  »  News  »  2023 రివ్యూ: మెగా జాతర.. ఫస్టాఫ్ హిట్,సెకండాఫ్ ఫట్!

Updated : Dec 12, 2023

2023 లో మెగా హీరోలు నటించిన సినిమాలు బాగానే విడుదలయ్యాయి. రామ్ చరణ్ తప్ప దాదాపు మెగా హీరోలంతా ఈ ఏడాది తమ సినిమాలతో సందడి చేశారు. అయితే ఫలితాలు మాత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా ఉన్నాయి.

ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి మంచి ఆరంభమే లభించింది. చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. సినిమాకి యావరేజ్ టాకే వచ్చినప్పటికీ అదిరిపోయే వసూళ్లతో సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-2 సినిమాగా నిలిచింది.

మెగాస్టార్ ఇచ్చిన సాలిడ్ స్టార్ట్ ని ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కంటిన్యూ చేశాడు. సాయి తేజ్ నటించిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ 'విరూపాక్ష' ఏప్రిల్ 21న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రూ.90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

మేనమామ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. జులై 28న రిలీజ్ అయిన ఈ సినిమా.. పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది.

'వాల్తేరు వీరయ్య' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి.. ఆగస్టు 11న 'భోళా శంకర్' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి, మెగాస్టార్ ఖాతాలో డిజాస్టర్ గా మిలిగింది.

మెగా బ్రాండ్ కి భిన్నంగా విభిన్న చిత్రాలతో అలరించే వరుణ్ తేజ్.. ఈ ఏడాది ఆగస్టు 25న 'గాండీవధారి అర్జున'తో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా కనీస వసూళ్లు రాబట్టలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ ఏడాదిని మెగా ఫ్యామిలీ పరాజయంతోనే ముగించింది. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా 'ఆదికేశవ' నవంబర్ 24న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. 

'వాల్తేరు వీరయ్య', 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్స్ తో మెగా ఫ్యామిలీకి 2023 ప్రథమార్థం బాగున్నప్పటికీ, ద్వితీయార్థం మాత్రం బాగా నిరాశపరిచింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.