![]() |
![]() |
నందమూరి బాలకృష్ణ.. పవర్‌ఫుల్ డైలాగులతో, ఔరా అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లతో విలన్లను చీల్చి చెండాడే నటసింహం. ఇలా నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, అతనిలో మరో టాలెంట్ కూడా ఉందని గత కొంతకాలంగా ప్రేక్షకులకు, సినిమా ఇండస్ట్రీకి అర్థమవుతోంది. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి షోలు ఎన్నో చేసిన అనుభవం ఉన్న హోస్ట్‌లా ఈ టాక్ షోను అద్భుతంగా నడిపిస్తున్నారు. బాలకృష్ణ. ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో మూడో సీజన్‌కి సన్నద్ధమవుతోంది. అయితే సీజన్ 3 ప్రారంభం కాకముందే ‘భగవంత్ కేసరి’, ‘యానిమల్’ చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమాలకు స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు బాలకృష్ణ. మూడో సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందులో గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారు.. వంటి ఆసక్తికరమైన అంశాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరిగాయి. త్వరలోనే సీజన్ 3ని ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని అందరూ భావించారు.
ఇదిలా ఉండగా... నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఆగిపోయిందా? అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. అలా రావడం వెనుక కారణం కూడా లేకపోలేదు. ‘అన్‌స్టాపబుల్’ కోసం అన్నపూర్ణ స్టూడియోలోని ఒక ఫ్లోర్‌లో సెట్ వేశారు. అయితే హఠాత్తుగా ఈ సెట్‌ను అక్కడి నుంచి తొలగించారు. దీంతో ఈ షో ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అన్‌స్టాపబుల్ అంటే ఎవ్వరూ ఆపలేనిది అని అర్థం. కానీ, షో మాత్రం ఆగిపోయింది అంటూ రకరకాల కామెంట్స్ వినిపస్తున్నాయి. బాలకృష్ణ వరసగా సూపర్‌హిట్ సినిమాలు చేస్తూ ఎంతో ఊపు మీద ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఒకదాని వెంట మరొకటి అన్నట్టుగా వరసగా సినిమాలు చేయబోతున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక రాజకీయంగా కూడా బాలకృష్ణ బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయ కార్యకలాపాలతో బిజీగా మారనున్న బాలయ్య ఆహాలో స్ట్రీమ్ అయ్యే అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌ను నిర్వహించేంత తీరిక ఇకపై ఉండబోదన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే అన్నపూర్ణ స్టూడియోలోని సెట్‌ను తొలగించారని అర్థమవుతోంది. అయితే ఈ విషయంలో ఆహా సంస్థ అధికారిక ప్రకటన చెయ్యాల్సి ఉంది.
![]() |
![]() |