![]() |
![]() |
సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్, జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిర్మించిన సూపర్‌హిట్ మూవీ ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం 7 ఆగస్ట్, 2015లో విడుదలైంది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని ఎలా అభివృద్ధి చేశాడు అనే ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో లవ్, ప్యామిలీ సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలను పొందుపరిచి ఒక కమర్షియల్ సినిమాగా రూపొందించారు కొరటాల శివ. అప్పట్లో ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులతోపాటు ఫిలింఫేర్, ఐఫా, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, సంతోషం అవార్డ్స్.. ఇలా ఎన్నో అవార్డులను గెలుచుకుంది ‘శ్రీమంతుడు’ చిత్రం.
ఇదిలా ఉంటే.. ‘శ్రీమంతుడు’ చిత్ర కథ తనదేనని రచయిత శరత్‌చంద్ర వార్తల్లోకి వచ్చారు. వేమూరి బలరామ్ సంపాదకత్వంలో ప్రచురితమవుతున్న స్వాతి మాస పత్రికలో తన రచనలో వచ్చిన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని రూపొందించారన సదరు రచయిత 2017లో క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. మహేష్‌బాబు, కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేనిలపై శరత్‌చంద్ర కేసు వేశారు. 1719/2017 కింద ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తమపై వేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మహేష్, కొరటాల శివ, నవీన్ హైకోర్టును ఆశ్రయించగా, కేసును ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జడ్జిమెంట్ కాపీలను విడుదల చేసింది కోర్టు. దీంతో క్రిమినల్ కేసును ఎదుర్కోవడం అని వార్యం అయింది. శరత్ చంద్ర తరఫున ప్రముఖ న్యాయవాది చల్లా అజయ్, రాజశేఖర్ పవని శివకుమార్ వాదించారు.
‘శ్రీమంతుడు’ సినిమా హీరో మహేష్‌కి ఎంతో పేరు తెచ్చిన సినిమా. ఉత్తమనటుడిగా అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. నటుడిగా మహేష్‌కి ఎంతో పేరు తెచ్చిన ఈ సినిమా కథ విషయంలో రచయిత శరత్‌చంద్ర కోర్టు వరకు వెళ్ళడంతో బోలెడంత అపఖ్యాతిని మూటకట్టుకున్నారు మహేష్.
![]() |
![]() |