![]() |
![]() |
ఎంత టాలెంట్ వున్నా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళే ప్రాసెస్‌లో ఒక్కోసారి తప్పటడుగులు కూడా వేయొచ్చు. అయితే ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే అవి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి, మనల్ని అందలం ఎక్కించడానికి సాయం చేస్తాయి. ప్రారంభంలో ఎన్నో తప్పులు చేసినవాళ్ళు సైతం వారి రంగంలో రాణించి పేరు ప్రఖ్యాతులు తెచుకున్నవారు ఉన్నారు. అందుకు ఉదాహరణే జాతీయ అవార్డు విన్నర్ డైరెక్టర్ సుధా కొంగర. కెరీర్ ప్రారంభంలో ఎంతో తక్కువ స్థాయి సినిమా చేసి ఆ తర్వాత వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ అంచెలు అంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును గెలుచుకునే స్థాయికి వెళ్లింది.
సినిమా రంగంలో మహిళా దర్శకులు వేళ్ళమీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. గతంలో భానుమతి, విజయనిర్మల, నందినిరెడ్డి, జయ బి., జీవితా రాజశేఖర్ వంటి వారు దర్శకులుగా రాణించారు. వారిలో విజయనిర్మల ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. వీరెవ్వరికీ సాధ్యం కాని జాతీయ అవార్డును సుధా కొంగర సాధించిందంటే మామూలు విషయం కాదు. సూర్య హీరోగా రూపొందించిన ‘సూరారై పాట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రంతో దర్శకురాలిగా జాతీయ అవార్డు అందుకున్నారు సుధ. ప్రస్తుతం ఈ సినిమాను అక్షయ్‌కుమార్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. సూర్యతో కూడా మరో సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. దర్శకురాలిగా ఇంతటి ఖ్యాతిని ఆర్జించిన సుధ తెలుగు సినిమాతోనే దర్శకురాలిగా పరిచయమయ్యారనే విషయం చాలా మందికి తెలీదు.
2008లో కృష్ణభగవాన్ ప్రధాన పాత్రలో ‘ఆంధ్రా అందగాడు’ పేరుతో ఓ సినిమా వచ్చింది. రొమాంటిక్ కామెడీ మూవీగా చాలా తక్కువ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. అంతకుముందే 2002లో రేవతి దర్శకత్వంలో వచ్చిన ‘మిత్ర్’ అనే సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. అప్పట్లో రేవతి ఈ సినిమాను ఒక ప్రయోగంగా తీశారు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ మహిళలే కావడం విశేషం. సుధ డైరెక్ట్ చేసిన ‘ఆంధ్రా అందగాడు’ ఆశించిన విజయం సాధించకపోవడంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసింది. ద్రోహి, ఇరుది సుట్రు, సాలా ఖుద్దూస్ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో దర్శకురాలిగా ఎదిగింది. సాలా ఖుద్దూస్ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘గురు’ పేరుతో తెరకెక్కించి సూపర్‌హిట్ సాధించింది సుధ.
![]() |
![]() |