![]() |
![]() |
ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ వస్తోందంటే సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి అనేది నెలకొంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలోని అన్ని కోణాలను సినిమాలో చూసే అవకాశం కలుగుతుంది. అతను ఏ విధంగా ఎదిగి ఆ స్థాయికి వచ్చాడు అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఈ తరహా సినిమాలు చేసేందుకు మొదట్లో కొందరు హీరోలు ఆసక్తి చూపారు. కొన్ని బయోపిక్స్ రిలీజ్ అయిన తర్వాత వారిలో ఆ ఉత్సాహం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే బయోపిక్స్ అంటే వంద శాతం కాకపోయినా ఎక్కువ శాతం సహజంగానే తియ్యాల్సి ఉంటుంది. సినిమా అంటేనే అసహజంగా ఉండే ప్రక్రియ. సినిమాటిక్‌గా ఉండే సన్నివేశాలు, హీరోయిజం, ఊహించని ట్విస్టులు...ఇలా ఉండే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సాదా సీదాగా సాగిపోయే బయోపిక్‌లను చూసేందుకు అంతగా ఇష్టపడరు అనేది కొందరు హీరోల అభిప్రాయం.
అయితే దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు హీరో ధనుష్. హీరో ఎలివేషన్స్ లేని బయోపిక్స్ చేసేందుకు అతను సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంగీత ప్రపంచంలో ఒక ప్రభంజనం సృష్టించిన ఇళయరాజా జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. చాలా తక్కువ స్థాయి నుంచి మహోన్నత స్థాయికి చేరుకున్న ఇళయరాజా జీవితంలో ఎన్నో వెలుగు నీడలు ఉన్నాయి. సంగీత దర్శకుడిగా ఇళయరాజా చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి. ఆ తర్వాత అలాంటి ప్రయోగాలు ఏ సంగీత దర్శకుడూ చెయ్యలేదు. అయితే శ్రోతల అభిరుచులు మారాయి. ఎప్పటికప్పుడు కొత్త తరహా సంగీతాన్ని స్వాగతిస్తున్నారు. ఒకవిధంగా ఇళయరాజా శకం దాదాపు ముగిసినట్టే. ఇప్పటి యువ సంగీత దర్శకులు కొత్త తరహా సంగీతంతో ఆకట్టుకుంటున్నారు. తన హయాంలో ఇళయారాజా అద్భుతాలు చేసి ఉందొచ్చు. ఇప్పుడు వాటిని చూపిస్తే ఆదరిస్తారా అనే వాదన కూడా వినిపిస్తోంది.
అయితే ధనుష్ ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఎంతో సంతృప్తి పొందుతాడు. అతని కెరీర్‌లో మాస్ ఎలిమెంట్స్, హీరోయిక్ ఎలివేషన్స్ లేని సినిమాలు కూడా విజయం సాధించాయి. అందుకే ధనుష్ కూడా ఈ సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచి మేరకు ఇళయారాజా బయోపిక్‌ను ఏ తరహాలో రూపొందించాలి, దానికి ధనుష్‌ను ఎలా మౌల్డ్ చెయ్యాలి అనే దానిపై దృష్టి పెడితే ఫలితం బాగుండే అవకాశం ఉంది. ఇళయారాజా జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశించాలి అంటే దానికి ఓటీటీ ప్లాట్‌ఫామే కరెక్ట్ అని కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువ ఎపిసోడ్స్ చేసి ఆయన జీవితం గురించి విస్తారంగా తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి ఈ బయోపిక్‌ను సినిమాగా తీస్తారా? వెబ్ సిరీస్‌గా చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ బయోపిక్‌ను స్టార్ట్ చేసి ఏడాది లోపే పూర్తిచేసి 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
![]() |
![]() |