![]() |
![]() |

కన్నడకు చెందిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ వచ్చే ఐదేళ్లకు సినిమాల కోసం ఏకంగా 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది. రాబోయే ఐదేళ్లలో మూడు వేల కోట్ల రూపాయలతో పలు చిత్రాలు నిర్మించనున్నట్లు ఆ నిర్మాణ సంస్థకు చెందిన విజయ్ కిరంగదూర్ తెలిపారు. ఈ సంస్థ మొదటగా తెలుగులో పలు విజయాలు సాధించిన దర్శకుడు జయంత్ సి పరాన్జీతో 2014లో నినిందరే అనే చిత్రాన్ని తీసి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. 2015లో మాస్టర్ పీస్, 2017 రాజకుమారా అనే చిత్రాలు తీసింది. 2018లో వీరు తీసిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం అత్యద్భుత విజయం సాధించింది. ఇక వీరు 2021 లో యువరత్న అనే సినిమా తీశారు. 2022లో కన్నడ పరిశ్రమకు, హోం బలే ప్రొడక్షన్స్ కు గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి చాప్టర్ కంటే రెండు మూడింతలు ఎక్కువ క్రేజ్‌ను, ఇమేజ్ ను సాధించింది. దేశాన్ని ఓ ఊపు ఉపేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా కాంతారా చిత్రం 16 కోట్లతో రూపొందితే ఏకంగా 400 కోట్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రాన్ని తీస్తున్నారు. ఆ వెంటనే వీరు మలయాళంలోకి అడుగుపెట్టనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో టైసన్ అనే సినిమా తీయడానికి పూనుకున్నారు. ఆ తరువాత భగీర, రిచర్డ్ ఆంటోనీ రెండు చిత్రాలు కన్నడలో రూపొందనున్నాయి. భగీర చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తుండగా, రిచర్డ్ ఆంటోనీకి రక్షిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నారు. ఆ వెంటనే మలయాళంలో మరో చిత్రం ధూమమ్ ని పవన్ కుమార్ అనే దర్శకునితో చేయనున్నారు.
అదేవిధంగా దక్షిణాదిలో మరో పెద్ద నిర్మాణ సంస్థగా పేరొందిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అతిపెద్ద సినిమాలను లైన్లో పెడుతోంది. ఈ సంస్థలో గతంలో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే శంకర్- రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన 2.0 తర్వాత మాత్రం ఆ సంస్థకు సక్సెస్ రేట్ బాగా తగ్గింది. ఇటీవల పోనియన్ సెల్వన్ 1 చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. దీనికి మణిరత్నం దర్శకుడు. ప్రస్తుతం పోనియన్ సెల్వన్ 2 చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. ఇంకా త్రిష ప్రధాన పాత్రలో రాంగి ఇటీవలే విడుదలైంది. కమలహాసన్-శంకర్ ల కాంబినేషన్లో ఇండియన్ 2, రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంతులతో లాల్ సలాం, నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ 62వ చిత్రం, పి. వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 చిత్రాలను ఈ సంస్థ నిర్మిస్తోంది. ఇలా చూసుకుంటే లైకా ప్రొడక్షన్స్ చేతిలో కూడా ఐదు చిత్రాలు ఉన్నాయి. ఇక లాల్ సలాం చిత్రానికి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. ఇవన్నీ భారీ బడ్జెట్‌లో రూపొందనున్న చిత్రాలే. ముఖ్యంగా ఇండియన్ 2, పోనియన్ సెల్వన్ 2 సినిమాలు సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటితో పాటు మిగిలిన చిత్రాలు కూడా బాగా ఆడితే మరల ఈ సంస్థకు పూర్వ వైభవం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
![]() |
![]() |