![]() |
![]() |

సంక్రాంతి సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ వచ్చేసింది. జనవరి 11న 'వారసుడు', 'తెగింపు' విడుదల కానుండగా.. జనవరి 12న 'వీర సింహా రెడ్డి', జనవరి 13న 'వాల్తేరు వీరయ్య', జనవరి 14న 'కళ్యాణం కమనీయం' వస్తున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాల విడుదల, థియేటర్ల కొరత కారణంగా 'వాల్తేరు వీరయ్య' ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టగల క్రేజ్ మెగాస్టార్ చిరంజీవి సొంతం. పైగా ఈసారి ఆయనకు మాస్ మహారాజా రవితేజ కూడా తోడయ్యాడు. దీంతో 'వాల్తేరు వీరయ్య'కి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని భావించారంతా. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం.. 'వాల్తేరు వీరయ్య'కి ప్రతికూలంగా ఉన్నాయి.
'వారసుడు' సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఆ చిత్రంతో పాటు 'తెగింపు', 'కళ్యాణం కమనీయం' చిత్రాలను కూడా ఆయనే పంపిణీ చేస్తున్నాడు. నైజాం, ఉత్తరాంధ్రలో మెజారిటీ థియేటర్లు ఆయన సినిమాలకు కేటాయించడంతో.. మిగిలిన థియేటర్లను 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' పంచుకోవాల్సి ఉంది. 'వీర సింహా రెడ్డి' ఒకరోజు ముందుగా జనవరి 12న విడుదలవుతుండటంతో.. 'వాల్తేరు వీరయ్య' థియేటర్లు కూడా తోడై మొదటి రోజు కాస్త మెరుగైన కలెక్షన్స్ రాబట్టే అవకాశముంది. కానీ 'వాల్తేరు వీరయ్య' పరిస్థితి వేరు. అసలే థియేటర్లు తక్కువ అంటే.. దానికితోడు విడుదల రోజే 'వీర సింహా రెడ్డి'తో కలిసి థియేటర్లు పంచుకోవాల్సి ఉంది. ప్రేక్షకులకు 'వాల్తేరు వీరయ్య' చూడాలని ఉన్నా.. థియేటర్ల సమస్య కారణంగా వారికి సినిమా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ. ఆ విధంగా 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ డే కలెక్షన్స్ కి భారీ దెబ్బ తగలనుంది. మరోవైపు 'వాల్తేరు వీరయ్య' రాకతో రెండో రోజు నుంచి 'వీర సింహా రెడ్డి' పరిస్థితి కూడా అలాగే ఉండనుంది.
'వారసుడు', 'తెగింపు' సినిమాలలో ఏదైనా సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకపోయినా.. ఆ థియేటర్లు కూడా 'వాల్తేరు వీరయ్య'కి వస్తాయనే ఆశలేదు. ఎందుకంటే జనవరి 14న 'కళ్యాణం కమనీయం' వస్తోంది. దానికి కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్. పైగా యూవీ క్రియేషన్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో చెప్పుకోదగ్గ స్థాయిలోనే విడుదలవుతుంది. ఇలా ఎటు చూసినా థియేటర్ల సమస్య వెంటాడుతోంది. మెగాస్టార్ సినిమాకి ఈ పరిస్థితి ఏర్పడటం ఆయన ఫ్యాన్స్ కి అసహనం కలిగిస్తోంది. 'వాల్తేరు వీరయ్య'కి మెగాస్టార్ రేంజ్ ఓపెనింగ్స్ అయితే అనుమానమే.. ఇక ఫుల్ రన్ లోనే ఆయన తన పవర్ చూపించాల్సి ఉందని అంటున్నారు.
![]() |
![]() |