![]() |
![]() |

కిందటి తరంలో స్టార్ హీరోలు అందరితోనూ నటించిన హీరోయిన్లు ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన వారు ఇప్పుడు హీరో హీరోయిన్ల తల్లి, అత్త పాత్రలకు సిద్ధమవుతున్నారు. ఈ కోవలోకి చాలామంది వస్తారు. ఇంద్రజ, నదియా, రమ్యకృష్ణ, టబు ఇలా ఎంతమందినో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక 90వ దశకంలో ఓ ఊపు ఊపిన హీరోయిన్లలో రంభ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. గుబులు రేపే అందం, కవ్వించే నటన, తనదైన చిలిపి నవ్వు, ఆకట్టుకునే అవయవ సౌందర్యం ఈమె సొంతం.
90 ల కాలంలో ఈమె కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వలేదు. తెలుగు, తమిళం, హిందీ సహా మొత్తం ఎనిమిది భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ ఇలా అందరు అగ్ర హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే. నాడు రంభకు ఆ ఒకటి అడక్కు చిత్రం ద్వారా ఈవివి సత్యనారాయణ పెద్ద క్రేజ్ తెచ్చి పెట్టారు. దాన్ని సద్వినియోగం చేసుకున్న రంభ ఆ తరువాత అందరూ అగ్ర దర్శకులతోనూ కలిసి నటించింది. ఈమెకు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. అందరూ జూనియర్ దివ్యభారతి అని పిలిచేవారు.
బొబ్బిలి రాజా తో పరిచయమైన దివ్యభారతి అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు వంటి అతి తక్కువ చిత్రాలు చేసి అతి చిన్న వయసులోనే హఠాత్తుగా ప్రమాదవశాత్తు మరణించింది. దాంతో అప్పటికే హిందీ లో వచ్చిన దిల్ మూవీకి రీమేక్ గా తెలుగులో తొలిముద్దు అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో దివ్యభారతి హీరోయిన్ కాక తమిళ దర్శకుడు, నటుడు త్యాగరాజన్ కుమారుడు, జీన్స్ ఫేమ్ ప్రశాంత్ హీరో. అప్పటికే దివ్య భారతి చాలా భాగం షూటింగ్ చేయడంతో తొలిముద్దు చిత్రాన్ని పూర్తి చేయడం కోసం దర్శకనిర్మాతలు రంభను తీసుకొని వచ్చి దివ్యభారతి పోలికలతో ఉన్న ఆమెను కాస్త లాంగ్ షాట్స్ లో చూపిస్తూ చిత్రాన్ని పూర్తి చేశారు. అలా ఆమెకు జూనియర్ దివ్యభారతిగా నాడు క్రేజ్ వచ్చింది.
ఈమె జేడీ చక్రవర్తితో కలిసి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో బొంబాయి ప్రియుడు చిత్రంలో నటించింది. అంతకుముందే విడుదలైన కే రాఘవేంద్రరావు -శ్రీకాంత్ -రవళి -దీప్తి భట్నాగర్‌ల కాంబినేషన్లో వచ్చిన పెళ్లి సందడి ఎంతటి సంచల విజయం నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. దాంతో శ్రీకాంత్ కు సమకాలీకుడైన జేడీ చక్రవర్తితో దర్శకేంద్రుడే ఈసారి కూడా బొంబాయి ప్రియుడు వంటి చిత్రం తీస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పెళ్లి సందడి రేంజిలో కాకపోయినా ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల ఈమె టీవీ రియాల్టీ షో జడ్జిగా కూడా కనిపించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెండి తెరపైకి విశేషాలను గురించి మాట్లాడుతూ, జెడి చక్రవర్తి నా వివాహానికి హాజరు కాలేదు. ఆయన ఎక్కువగా నాతో టచ్ లో లేనందువలన నేను చాలా బాధపడ్డాను. నాకున్న అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులలో జేడీ ఒకరు.
స్నేహం మెయింటైన్ చేసే విషయంలో ఆయన పెద్ద అబద్దాలకోరు.... అంటూ తమాషా వ్యాఖ్యలు చేసింది. కాగా ఈమె త్వరలో పునరాగమనం చేయాలని భావిస్తోంది. సపోర్టింగ్ యాక్టర్లకు మంచి అవకాశాలు ఇస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, హరీష్ శంకర్, బోయపాటి, అనిల్ రావిపూడి వంటి టాప్ డైరెక్టర్లు ఈమె పై ఓ లుక్కేస్తే మరల రంభను మరోసారి వెండితెరపై చూడగలమని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
![]() |
![]() |